కోర్టుల్లో కొండలా పేరుకుపోయిన ‘రెవెన్యూ’ కేసులు | large number of revenue cases are pending in supreme court | Sakshi
Sakshi News home page

కోర్టుల్లో కొండలా పేరుకుపోయిన ‘రెవెన్యూ’ కేసులు

Published Fri, Nov 28 2014 11:56 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

కోర్టుల్లో కొండలా పేరుకుపోయిన ‘రెవెన్యూ’ కేసులు - Sakshi

కోర్టుల్లో కొండలా పేరుకుపోయిన ‘రెవెన్యూ’ కేసులు

కోర్టు కేసులు రెవెన్యూ యంత్రాంగం ముందరి కాళ్లకు బంధం వేస్తున్నాయి. భూ వివాదాలపై ఇబ్బడిముబ్బడిగా కేసులు నమోదవుతుండడంతో అధికారగణానికి కోర్టుల చుట్టూ తిరగడంతోనే సరిపోతోంది. జిల్లాలో స్థిరాస్తి వ్యాపారం ఊపందుకోవడం, భూముల విలువలు ఆకాశన్నంటడంతో రెవెన్యూ తగాదాలు పెరిగాయి. దీనికితోడు ల్యాండ్ మాఫియా కూడా చెలరేగిపోవడం.. భూములను ఆక్రమించడమేకాకుండా యాజమాన్య హక్కులను సవాల్ చేస్తుండడం యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. జిల్లాకు సంబంధించి వివిధ కోర్టుల్లో 1,409 కేసులు నడుస్తున్నాయి.
 
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కోర్టు కేసులతో రెవెన్యూ యంత్రాం గం సతమతమవుతోంది. జిల్లా పరిధిలో నమోదవుతున్న ‘రెవెన్యూ’ కేసుల పర్యవేక్షణకే జిల్లా అధికారులు అధిక సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. నగర శివార్లలో అక్రమార్కులు విలువైన స్థలాలను కబ్జా చేయడం.. వాటిని సొంతం చేసుకునేందుకు సుప్రీంకోర్టు వరకూ వెళ్తుండడంతో కేసులను ఎదుర్కోవడం అధికారులకు చిరాకు కలిగిస్తోంది.  బలంగా వాదనలు వినిపించడం ద్వారా సర్కారీ స్థలాలను కాపాడుకునే దిశగా యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది.

జిల్లావ్యాప్తంగా వివిధ కోర్టుల్లో 1,409 కేసులు నడుస్తున్నాయి. దీంట్లో అధికశాతం కక్షిదారు.. ప్రభుత్వానికి మధ్యే ఉన్నాయి. ఇవేకాకుండా వివిధ న్యాయస్థానాలు సుమోటోగా స్వీకరించిన కేసులు, దాఖలు చేసిన వ్యాజ్యాలు కూడా భారీగానే ఉన్నాయి. కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ‘న్యాయ విభాగం’ ఉంది. డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి దీనికి నేతృత్వం వహిస్తున్నప్పటికీ, అడ్డగోలుగా దాఖలవుతున్న కేసులను సమర్థవంతంగా వాదించేందుకు రికార్డులు తయారు చేయడంలో పనిఒత్తిడిని ఎదుర్కొంటోంది. చట్టాలపై అధికారులకు పట్టులేకపోవడం.. కేసుల సంఖ్య చాంతాడులా పెరిగిపోతుండడం యంత్రాంగాన్ని కుంగదీస్తోంది.
 
సుప్రీంలో 28 కేసులు!
సర్వోన్నత న్యాయస్థానంలో జిల్లాకు సంబంధించి 28 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని క్రమంతప్పకుండా పర్యవేక్షించడం రెవెన్యూ అధికారులకు కత్తిమీద సాములా పరిణమించింది. కేసు విచారణకు వచ్చినప్పుడల్లా ఢిల్లీకి వెళ్లాల్సిరావడం, అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ లేదా ప్రభుత్వ తరుఫున వాదించే న్యాయవాదికి కేసు పూర్వపరాలు వివరించేందుకు తహసీల్దార్లు వెళ్లాల్సివస్తోంది. సుప్రీంకోర్టు విచారణ ఉన్న కేసుల్లో అధికశాతం నగర శివారు ప్రాం తానికి చెందినవే ఉన్నాయి. వీటి విలువ రూ.కోట్లలో ఉండడంతో హస్తినకు విధి గా వెళ్లి వస్తున్నారు. శంషీగూడ, రాయదుర్గ నవ్‌ఖల్సా, కోకాపేట, మియాపూర్ తదితర ప్రాంతాలకు సంబంధించిన కేసులు సుప్రీంలో ఉన్నాయి.

వీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న జిల్లా యంత్రాంగం.. కోర్టులో నెగ్గేందుకు అవసరమైన రికార్డుల తయారీలో నిమగ్నమవుతోంది. ఈ నేపథ్యంలో సిబ్బంది కొరత న్యాయవిభాగాన్ని పట్టిపీడిస్తోంది. ఇదిలావుండగా, హైకోర్టులో కూడా రికార్డు స్థాయిలో కేసులు నడుస్తున్నాయి. మొత్తం 864 కేసులుండగా, ఇందులో అధికశాతం రెవెన్యూ విభాగానికి చెందినవే. భూ వివాదాల్లో ఇచ్చిన తీర్పులను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించిన కక్షిదారులు సహా.. విలువైన భూములను రక్షించుకునేందుకు ప్రభుత్వం కూడా కోర్టులో దాఖలు చేసిన కేసులు ఉన్నాయి. సర్వోన్నత, ఉన్నత న్యాయస్థానాల్లోనేకాకుండా జిల్లా కోర్టులు, లోకాయుక్త, ల్యాండ్ గ్రాబింగ్, సివిల్/మున్సిఫ్ కోర్టులు, ఎల్‌ఆర్‌టీ, ఎల్‌ఆర్‌ఏటీ, ఎండోమెంట్ ట్రిబ్యునల్, రెవెన్యూ కోర్టులో కేసుల జాబితా కొండలా పెరిగిపోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement