ర్యాలీలో పాల్గొన్న మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, నాయకులు
షాద్‌నగర్‌టౌన్: ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఓ కూటమిని ఏర్పాటు చేశాయని, ఆ కూటమిలో అందరు దొంగలు ఉన్నారని, మహా కూటమితోనే ఒరిగేదేమీ లేదని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం షాద్‌నగర్ నియోజకవర్గంలోని హాజిపల్లి, కిషన్‌నగర్ గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌నగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. దొంగల కూటమిలో కాంగ్రెస్, టీడీపీలతో పాటు మరిన్ని పార్టీలు జతకట్టాయని, చంద్రబాబునాయుడు తెలంగాణకు వచ్చి ప్రచారం చేసినా ఒరిగేదేమీ లేదన్నారు.
పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును ఆపాలని చంద్రబాబునాయుడు కేంద్ర వాటర్ బోర్డు కమిషన్‌కు లేఖలు రాశారని, ప్రచారానికి వచ్చే ఆయన ఎందుకు ప్రాజెక్టు పనులు ఆపారని ప్రజలు అడిగితే ఏం సమాధానం చెబుతాడని ప్రశ్నించారు. ఎంత మంది చంద్రబాబునాయుడులు వచ్చినా తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ వైపే ఉంటారని చెప్పారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతం పూర్తిగా నిరాధారణకు గురైందన్నారు. నిధులు, నీళ్లు, ఉద్యోగాలను సీమాంధ్ర ప్రాంత నాయకులు తరలించుకపోయారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేందుకు పార్టీ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని చేపట్టారని చెప్పారు. ఎందరో త్యాగాల పునాదుల మీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని, కొట్లాది సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ అహర్నిషలు కృషిచేస్తున్నారని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు.
లక్ష్మిదేవునిపల్లి ప్రాజెక్టును పూర్తిచేస్తాం
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందని, ఈ పథకంలో భాగంగా కొందుర్గు వద్ద లక్ష్మిదేవునిపల్లి ప్రాజెక్టును నిర్మించేందుకు రూపకల్పన చేసినట్టు మంత్రి చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ నాయకులు కోర్టులకు వెళ్లి కేసులు వేస్తున్నారని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తి కావాలంటే టీఆర్‌ఎస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకరావాలని ఆయన ప్రజలను కోరారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాల కోసం రూ.42వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. టీఆర్‌ఎస్ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మెనిఫెస్టోను తయారు చేసిందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తామని ప్రకటిస్తే.. కాంగ్రెస్ రెండు లక్షల రూపాయలను ప్రకటించిందని, ఇది కాంగ్రెస్ పార్టీ అవివేకానికి నిదర్శనమన్నారు.
తెలంగాణలో ఏ రైతుకూ రెండు లక్షల రూపాయల రుణం లేదన్నారు. కాంగ్రెస్ నేతలు తెలివితక్కువ దద్దమ్మలని, వచ్చే ఎన్నికల్లో ప్రజలను వారిని ఏవిధంగా ఎన్నుకుంటారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ మాట్లాడుతూ.. సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు.
ప్రజలు ఈ ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టాలని, టీఆర్‌ఎస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు అందెబాబయ్య, శ్యాంసుందర్‌రెడ్డి, జిల్లెల వెంకట్‌రెడ్డి, సూర్యప్రకాష్, వెంకట్‌రాంరెడ్డి, లక్ష్మణ్, శోభ, వెంకట్‌రెడ్డి, నరేందర్, రఘునాథ్ యాదవ్, గుళ్లె కృష్ణయ్య, సంజీవరెడ్డి, యుగెందర్, సజ్జల కాశీనాథ్, శ్రీశైలం, చిల్కమర్రి రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment