శాసన సభ వెలవెల!
- ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రులు
- ఆ ఆరు జిల్లాల ఎమ్మెల్యేల హాజరూ పలచనే
సాక్షి, హైదరాబాద్: శాసన మండలి ఎన్నికల ప్రభావం అసెంబ్లీ సమావేశాలపైనా పడింది. రాష్ట్రంలో రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి శుక్రవారం ప్రచారానికి చివరి రోజు కావడంతో అధికార టీఆర్‌ఎస్ సభ్యులు తమ సొంత జిల్లాలకే పరిమితం అయ్యారు. ఏడుగురు మంత్రులు ఆయా జిల్లాల్లో తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో శుక్రవారం సభలో సభ్యుల సంఖ్య పలుచగా కనిపించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సైతం సభలో కొద్దిసేపే ఉన్నారు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గం అభ్యర్ధి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తరఫున ఆ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జి, మంత్రి టి.హరీశ్‌రావు ఖమ్మంలో ప్రచారంలో పాల్గొన్నారు. ఆ జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కూడా హరీశ్‌రావుతో కలసి ప్రచారం చేశారు. మరో మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి గ్యాదరి కిషోర్ నల్లగొండ జిల్లాలో ప్రచారం చేశారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్ధి దేవీప్రసాద్ తర ఫున ఈ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జి, మంత్రి కె.తారకరామారావు మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రచారంలో ఉన్నారు.
కాగా, ఆ జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, డాక్టర్ లక్ష్మారెడ్డి కూడా ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో ఈ మంత్రులు ఎవరూ శుక్రవారం అసెంబ్లీకి హాజరు కాలేదు. రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి పి.మహేందర్‌రెడ్డి సైతం ఎన్నికల ప్రచారంలోనే ఉన్నారు. ఈ రెండు నియోజకవర్గాల పరిధిలోని ఆరు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ప్రచారంలోనే ఉన్నారు. వరంగల్ జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్ మాత్రం సభకు హాజరయ్యారు. సీఎం కూడా కొద్దిసేపు మాత్రమే సభలో ఉండి వెళ్లడంతో సభా బాధ్యతలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చూసుకున్నారు.