బతుకమ్మకు గోరంత నిధులే..!
మోర్తాడ్ : తెలంగాణ ఆడపడుచులకు ఇష్టమైన పండుగ బతుకమ్మ.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ పండుగను తెలంగాణ పండుగగా ప్రభుత్వం గుర్తించింది. దీంతో తెలంగాణ ఆడపడుచుల్లో ఆనందం వెల్లివిరిసింది. కాగా ప్రభుత్వం పండుగ నిర్వహణకు కేటాయించిన నిధులను పరిశీలిస్తే సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. బతుకమ్మ పండుగకు సీఎం కేసీఆర్ రూ. 10 లక్షలు మాత్రమే కేటాయించారు. పండుగ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లకు ఈ నిధులు ఏ మాత్రం సరిపోవని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. బతుకమ్మ పండుగను వారం రోజుల పాటు నిర్వహించిన తరువాత చెరువుల్లో రాత్రి పూట నిమజ్జనం చేయడం సంప్రదాయం.
బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి చెరువులకు వెళ్లడానికి రోడ్డును నిర్మించడం, లైటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బతుకమ్మ ఊరేగింపు సందర్భంగా ప్రధాన కూడలి వద్ద భారీగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జిల్లాకు కేటాయించిన రూ. 10 లక్షలతో ఇవన్నీ చేయాలంటే కష్టమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 718 గ్రామ పంచాయతీలు, ఒక నగర కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. మండలాల వారీగా నిధులు కేటాయిస్తే ఒక మండలానికి రూ. 27 వేల చొప్పున కేటాయించాల్సి వస్తుంది.
గ్రామాల వారీగా అయితే ఒక గ్రామానికి రూ. 1,300 మాత్రమే కేటాయించవచ్చు. నగర కార్పొరేషన్, మున్సిపాలిటీలకు నిధులు ఎక్కువగా అవసరమవుతాయి. మున్సిపాలిటీలకు నిధులు ఎక్కువగా కేటాయిస్తే గ్రామాలకు నిధుల శాతం తగ్గుతుంది. గత ప్రభుత్వం బతుకమ్మ పండుగకు జిల్లాకు రూ. లక్ష మాత్రమే నిధులను కేటాయించింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం తీరు పట్ల నిరసన వ్యక్తం చేసింది.
ఇప్పుడు నిధుల పరిమితిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెంచినా సరిపడేంత కేటాయించకపోవడంతో స్థానిక సంస్థలపై భారం తప్పడం లేదనే వాదన వినిపిస్తుంది. గ్రామానికి రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు కేటాయిస్తే బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు సజావుగా చేయవచ్చని పలువురు సర్పంచ్‌లు అభిప్రాయం వ్యక్తం చేశారు. నిధులు సంపూర్ణంగా కేటాయించకపోవడంతో ఏర్పాట్లు ఎలా చేయాలని సర్పంచ్‌లు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నిధులను పెంచాలని పలువురు కోరుతున్నారు.