వచ్చే నెల నుంచి మూసివేత..
♦ సుప్రీం’ తీర్పు అమలుపై ఎక్సైజ్ కసరత్తు
♦ హైవే పక్కనున్న దుకాణాలకు మళ్లీ నోటీసులు
♦ వచ్చే నెల నుంచి బంద్‌కు ఉత్తర్వులు
♦ ఉమ్మడి జిల్లాల్లో సగానికిపైగా రోడ్డు పక్కనే..
♦ అక్టోబర్ 1నుంచి కొత్తషాపుల నిర్వహణ
♦ ఈ నెలాఖరు నుంచే టెండర్ల ప్రక్రియ..
సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు మద్యనిషేధ, ఆబ్కారీశాఖ కసరత్తు చేస్తోంది. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఉన్న మద్యం దుకాణాలకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన నిబంధనలపై ఇప్పటికే నిర్వాహకులకు మార్చిలో నోటీసులు ఇచ్చింది. అయితే ఆర్థిక సంవత్సరంలో అర్ధంతరంగా వైన్స్‌లు, బార్లు మూసి వేయడం, తరలించడం సాధ్యంకాదని పలువురు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంలో ఉన్న దుకాణాలకు వెసులుబాటు కల్పించారు.అయితే అక్టోబర్ 1 నుంచి 2017–18 ఎక్సైజ్ సంవత్సరానికి కొత్త వైన్‌షాపులను ప్రారంభించాల్సి ఉండగా.. ఈ నెలాఖరునుంచే నోటిఫికేషన్, టెండర్ల ప్రక్రియను మొదలెట్టేందుకు ఆబ్కారీ శాఖ సమాయత్తమవుతోంది. అంతకుముందే జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్లు లోబడి ఉన్న వైన్స్‌లు, బార్లను మూసేందుకు తాజాగా నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
సాక్షి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం 269 మద్యం దుకాణాలు, 54 బార్లు ఉన్నాయి. ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం 269 దుకాణాల్లో దాదాపు సగానికి పైగా దుకాణాలు 500 మీటర్లలోపే ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న 54 బార్ అండ్ రెస్టారెంట్ల పరిస్థితి కూడా ఇదే. ఇంకా చెప్పాలంటే రాష్ట్ర, జాతీయ రహదారులకు ఇవి కేవలం 100 మీటర్లలోపే ఉన్నాయి. వీటిలో చాలా వరకూ రహదారుల వెంటనే ఏర్పాటు చేశారు. వీటికి అనుబంధంగా పర్మిట్ రూములున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న బార్లలో అయితే దాదాపు మొత్తం రహదారుల వెంటే ఉన్నాయి.
ఇవన్నీ ఆబ్కారీ శాఖ కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఉన్నాయి. రాష్ట్ర, జాతీయ రహదారుల వెంట 500 మీటర్ల దూరంలో మద్యం అమ్మకాలను నిషేధిస్తూ 2016 డిసెంబర్ 15వ తేదీన సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిని ఎక్సైజ్ శాఖ వెంటనే అమలు చేయాలని కోరింది. తాజాగా వచ్చే అక్టోబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర, జాతీయ రహదారులకు 500 మీటర్ల దూరంలో ఉన్న వాటికి మాత్రమే మద్యం జారీ చేయాలని లేని వాటికి మద్యం జారీ ఇవ్వకూడదని ఎక్సైజ్‌శాఖ కమిషనర్ చంద్రవదన్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకూ లెసెన్స్‌లు గడువు ఉండడంతో పలు వైన్స్‌లకు కొత్త టెండర్లు ఖరారు చేసేందుకు రంగం సిద్ధమైంది.
వచ్చే నెల ఒకటి నుంచే ఉత్తర్వుల అమలు..
ఎక్‌పైజ్ శాఖ పేర్కొంటున్న 500 మీటర్ల పరిధిలో రాష్ట్ర రహదారుల వెంట కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 12 మద్యం దుకాణాలు, 20 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిలో అనేక ప్రముఖ బార్లు, హోటళ్లు, రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. కరీంనగర్ రూరల్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 14 మద్యం దుకాణాలు, ఒక బార్, రెస్టారెంట్ ఉంది. తిమ్మాపూర్ మండలం పరిదిలో 5 వైన్స్‌లున్నాయి. జాతీయ రహదారుల వెంట 500 మీటర్ల లోపల కరీంనగర్ అర్బన్ పరిధిలో రెండు బార్లు, కరీంనగర్‌రూరల్ పరిధిలో 6 వైన్స్‌లు, తిమ్మాపూర్‌లో 1, హుజూరాబాద్‌లో 11 వైన్స్, రెండు బార్లు ఉన్నాయి. అక్టోబర్ 1 నుంచి కొత్త దుకాణాలు ప్రారంభించేందుకు వీలుగా టెండర్లు నిర్వహించాల్సి ఉన్నందునా సుప్రీంకోర్టు ఆదేశాలను వచ్చే నెల నుంచే అమలు చేసేందుకు సన్నద్ధం కావడం చర్చనీయాంశం అవుతోంది.