చార్మినార్ సమీపంలో సేకరించిన చెత్తను తీసుకెళ్తున్న జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు
సాక్షి, చార్మినార్: పాతబస్తీ వీధులన్నీ దిగ్బంధనమయ్యాయి. ఎక్కడి ప్రజలు అక్కడే ఇళ్లకు పరిమితమయ్యారు. బయటికి వెళ్లకుండా కొన్ని ప్రాంతాలను కంటైన్‌మెంట్ క్లస్టర్లుగా మార్చడంతో జనసంచారం తగ్గింది. ప్రధాన రహదారులతో పాటు గల్లీలన్నీ నిర్మానుష్యంగా మారాయి. మొన్నటిదాకా ప్రజల సంచారం ఎక్కువగా కనిపించింది. లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ జనాలతో కొన్ని కొన్ని వీధులు కిక్కిరిసిపోయాయి.
ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడంలేదు. రెండు రోజుల క్రితం జీహెచ్‌ఎంసీ చారి్మనార్ జోన్ పరిధిలోని 6, 7, 8 సర్కిళ్ల పరిధిలో ప్రత్యేక కంటైన్‌మెంట్ క్లస్టర్లను ఏర్పాటు చేసిన అధికారులు.. శనివారం 9,10 సర్కిళ్లల్లోనూ కొత్తగా కంటైన్‌మెంట్ క్లస్టర్లను ఏర్పాటు చేశారు. బారికేడ్ల వద్ద నోడల్ అధికారులను నియమించారు. ఫోన్ సమాచారం ద్వారా నిత్యావసరాలను అందజేస్తున్నారు. బస్తీవాసులు బయటికి రాకుండా.. బయటివాళ్లు లోనికి రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. బారికేడ్ల వద్ద ప్రత్యేక పికెట్లను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.
లాల్‌దర్వాజా వద్ద రేషన్ బియ్యం తీసుకెళ్తున్న చిన్నారులు
మూత పడిన మీరాలంమండీ..
మీరాలమండీలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. ఎలాంటి నిత్యావసర వస్తువులను విక్రయించడం లేదు. మూకుమ్మడిగా దుకాణాల మూసివేతతో ఇక్కడి వీధులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ప్రజలు భారీగా వస్తుండడంతో ఇక్కడి వీధులన్నీ మొన్నటివరకు రద్దీ ఉండేవి. దుకాణాల వద్ద గుంపులు గుంపులుగా వినియోగదారులు చేరడంతో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. సంబందిత పోలీసులు కట్టడి చేసే ప్రయత్నాలు చేసినా.. ప్రయోజనం లేకపోయింది.
దీంతో ఇక్కడి వ్యాపారులను మీర్‌చౌక్ పోలీసులు వీరికి అవగాహన కలి్పంచారు. సామాజిక దూరం పాటించకపోతే కేసులు పెడతామని హెచ్చరించడంతో వ్యాపారులు మూకుమ్మడిగా తమ దుకాణాలను మూసివేసి బంద్ పాటిస్తున్నారు. తమకు పోలీసులు తగిన బందోబస్తు కల్పించి వినియోగదారులు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటే దుకాణాలను తెరచి నిత్యావసర వస్తువులను విక్రయిస్తామని మీరాలంమండీ మర్చంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గాజుల అంజయ్య తెలిపారు.
పాతబస్తీలో కట్టడి ఇలా..
- చార్మినార్ సర్కిల్– 9లో శనివారం కొత్తగా మాతాకీకిడికీ, ఫతేదర్వాజా, నూర్‌ఖాన్ బజార్ తదితర బస్తీలను దిగ్బంధనం చేశారు
- ఫలక్‌నుమా సర్కిల్– 10లో రోషన్‌కాలనీ, మహమూద్‌నగర్, అలీబాగ్ బస్తీలను కొత్తగా కంటైన్‌మెంట్ క్లస్టర్‌గా గుర్తించారు
- మలక్‌పేట్ సర్కిల్– 6 పరిధిలోని అక్బర్‌బాగ్ డివిజన్‌లో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో బీ బ్లాక్ కాలనీ, ఆస్మాన్‌గఢ్, తిరుమల హిల్స్, ఆనంద్‌నగర్, వాకర్‌బాగ్, జీవన్ యార్ జంగ్ కాలనీ, ఎల్‌ఐసీ కాలనీ, సపోటా బాగ్, పూసలబస్తీ ప్రజలను కట్టడి చేస్తున్నారు
- చావునీ డివిజన్‌లో మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో సుల్తాన్‌దయారా, గుడ్డిబౌలి, బాగ్‌హే జహేరా, కుర్మగూడ కాలనీ ప్రాంతాలను కట్టడి చేశారు
- ఆజంపురా డివిజన్‌లో రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆఫీసర్స్ కాలనీ, జడ్జెస్ కాలనీ, చంచల్‌గూడ, బాగ్‌హే జహేరా ప్రాంతాల్లో ప్రజలను ఇళ్లకే పరిమితం చేశారు
- ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్‌లో ఒక పాజిటివ్ కేసుతో పాటు మర్కజ్‌కు వెళ్లొచ్చిన 46 మంది ఉండటంతో శంకర్‌నగర్, సరోజినీనగర్, పద్మానగర్, పంచశీల, మసీద్–ఇ–సాద్ బస్తీలను దిగ్బంధించారు
- సంతోష్‌నగర్ సర్కిల్–7 పరిధిలోని డబీర్‌పురా డివిజన్‌లో ఒక పాజిటివ్ కేసుతో పాటు మూడు అనుమానిత కేసులుండటంతో బెన్నీసాబ్‌కా బగ్లా, అలీ కేఫ్, గ్రేవియార్డ్, రోషన్‌దౌలా, జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ హల్ ప్రాంతాల్లో ప్రజలను కట్టడి చేస్తున్నారు
- కుర్మగూడ డివిజన్‌లో రెండు పాజిటివ్ కేసులతో పాటు ఏడుగురు మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారు ఉండటంతో దరాబ్‌జంగ్ కాలనీ, మస్కతీ గ్రౌండ్, సాలార్‌నగర్ దిగ్బంధించారు
- రెయిన్‌బజార్ డివిజన్ పరిధిలో ఒక పాజిటివ్ కేసుతో పాటు 14 మంది మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారు ఉండటంతో ఇస్లామియా కాలేజీ, ఎస్సార్టీ కాలనీ, రెయిన్‌బజార్ చమాన్, మదీనానగర్, యశ్రఫ్‌నగర్, ఈస్ట్ చంద్రానగర్ ప్రాంతాలను కట్టడి చేసి.. ఆయా బస్తీల ప్రజలకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తున్నారు.
కంటైన్‌మెంట్‌లో కంటిన్యూ
సాక్షి, హైదరాబాద్: కరోనా పాజిటివ్ కేసులు గుర్తించి ఏర్పాటు చేసిన కంటైన్‌మెంట్ జోన్ల పరిధిలో శనివారం కూడా గస్తీ కొనసాగింది. పోలీస్, వైద్య, జీహెచ్‌ఎంసీ యంత్రాంగం సహాయక చర్యలో నిమగ్నమైంది. పోలీ సు లు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టగా, జీహెచ్‌ఎంసీ సిబ్బంది కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూసిన ప్రాంతాల్లో రసాయనాల స్ప్రే చేశారు. వైద్య సిబ్బంది కూడా ఇంటింటికి తిరుగుతూ వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఓల్డ్‌మలక్‌పేట్ కాలనీలో రసాయనాలు చల్లుతున్న సిబ్బంది
- ఫిలింనగర్ టోలిచౌకి సమీపంలోని హకీంపేటలో రాకపోకలు పూర్తిగా నిషేధించారు అక్కడ ఫ్లెక్సీలు, బారికేడ్లు, పికెట్ ఏర్పాటు చేశారు.
- కంటైన్‌మెంట్ జోన్‌గా గుర్తించి 24 గంటలు గడవకముందే హస్మత్‌పేటలో జనం బయటకు వచ్చి రాకపోకలు సాగించారు. పోలీసులు అమలు చేస్తున్న ఆంక్షలను ఏ మాత్రం పట్టించుకోలేదు.
- మలక్‌పేట పరిధిలోని వాదే ముస్తఫా, షాహిన్‌నగర్, మిలాన్ కాలనీ, కొత్తపేట, ఓల్డ్ మలక్‌పేట, శంకర్‌నగర్, వాహెద్‌నగర్, కాలాడేరా, రేస్‌కోర్స్ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరినీ బయటకు రాకుండా చేశారు. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, పోలీసు అధికారుల సమన్వయంతో నిత్యావసర సరుకులు అందచేశారు. బాలాçపూర్, మలక్‌పేట్‌ల పరిధిలోని కాలనీల్లోని ప్రతీ ఇంటి ముందు జీహెచ్‌ఎంసీ సిబ్బంది రసాయనాలు స్ప్రే చేశారు. జలమండలి అధికారులు మంచినీటి సమస్య రాకుండా చూశారు.
- మోండాడివిజన్ మారేడుపల్లి టీచర్స్ కాలనీలో కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తి ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. వైద్య సిబ్బంది ఇళ్లల్లో సర్వే చేపట్టింది.
- చిలకలగూడ ఠాణా పరిధిలో బౌద్ధనగర్, కౌసర్‌మసీదు, శ్రీనివాసనగర్‌లలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో బారికేడ్లు, ఇనుపజాలీలతో రాకపోకలను నిషేధించి ఆయా ప్రాంతాలను అష్టదిగ్బంధనం చేశారు. జీహెచ్‌ఎంసీ, పోలీస్, వైద్య ఆరోగ్య, రెవెన్యూ, ఆర్ అండ్ బీ తదితర విభాగాలను సమన్వయం చేస్తు కంటైన్‌మెంట్ క్లస్టర్లలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన ఏర్పాట్లు చేపట్టారు. అక్కడి నివాసితులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆయా ఇళ్ల వద్దకే కూరగాయలు, నిత్యావసరాలను సరఫరా చేశారు.
- షేక్‌పేట్ డివిజన్‌లో కంటైన్‌మెంట్ జోన్లలో బల్దియా సెంట్రల్‌జోన్ జోనల్ కమిషనర్ ప్రావీణ్య పర్యటించారు. నిత్యావసర సరుకుల కోసం ఈజోన్ల పరిధిలో కుటుంబానికి ఒక్కరికే బయటికి వెళ్లే అనుమతి ఉందన్నారు.
కంటైన్‌మెంట్ జోన్‌గా గుర్తించిన హస్మత్‌పేట ప్రధాన రహదారిలో రాకపోకలు ఇలా
Comments
Please login to add a commentAdd a comment