ఇంతింతై... మహాగణపతియై.. | Mahaganapathi preparing khairatabad | Sakshi
Sakshi News home page

ఇంతింతై... మహాగణపతియై..

Published Mon, Aug 11 2014 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 11:41 AM

Mahaganapathi preparing khairatabad

  •       సిద్ధమవుతున్న ఖైరతాబాద్ మహాగణపతి
  •      ఉత్సవాలకు షష్టిపూర్తి
  •      వచ్చే ఏడాది నుంచి తగ్గనున్న ఎత్తు
  •  మహాగణపతి విగ్రహం బరువు: 40 టన్నులు మహా విగ్రహంతో పాటు పక్కనున్న దేవతా విగ్రహాల తయారీకి వాడే పదార్థాలు
     స్టీలు: 20 టన్నులు
     ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్: 40 టన్నులు
     గోనె సంచులు: 10 వేల మీటర్లు
     బంకమట్టి: 500 బ్యాగులు (ఒకటిన్నర టన్నులు)
     నార: 75 బండిళ్లు( రెండున్నర టన్నులు)
     చాక్ పౌడర్: 100 బ్యాగులు
     పనివారు: 150 మంది
     
    ఖైరతాబాద్ అనగానే భక్తుల మదిలో మెదిలేది ‘మహా’గణపతి రూపం. ఏటా ఒక్కో అడుగూ పెరుగుతూ భిన్నమైన ఆకృతిలో కనువిందు చేస్తూ భక్తులతో ‘జై’ కొట్టించుకుంటున్న గణనాథుడు ఇంత భారీగా దర్శనమివ్వడం ఇదే చివరిసారి. వచ్చే ఏడాది నుంచి లంబోదరుడి రూపం ఒక్కో అడుగూ తగ్గనుంది. అవును మీరు చదివింది నిజమే. ఒక్క అడుగుతో మొదలైన గజాననుడి రూపం ఆరోహణ క్రమంలో పెరిగి ప్రస్తుతం 60 అడుగులకు చేరింది. వచ్చే ఏడాది నుంచి ఒక్కో అడుగు తగ్గుతూ అవరోహణ క్రమంలో రూపు దిద్దుకోనుంది. అందుకే ఈ ఏడాది విఘ్ననాయకుడి మహారూపం తయారీలో ప్రతి విషయమూ ప్రత్యేకమే. ఆ విశేషాలు...
     
    ఖైరతాబాద్: గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని ఖైరతాబాద్‌లో ఈ ఏడాది ఏర్పాటవుతున్న 60 అడుగుల మహాగణపతి విగ్రహానికి అన్నీ విశేషాలే.
     
    తొలిసారిగా 1954లో ఖైరతాబాద్‌లో గణపతిని ఏర్పాటు చేశారు. ఈ ఏడాదికి 60 ఏళ్లు పూర్తవుతాయి.
     
    మహా గణపతి ఈ ఏడాది 60 అడుగుల ఎత్తులో కమలంపై నిల్చొని‘కైలాస విశ్వరూప మహా గణపతి’గా దర్శనమివ్వనున్నారు.
     
    షష్టిపూర్తి (60 ఏళ్లు) సందర్భంగా ప్రత్యేకంగా వినాయకుడి కుటుంబాన్ని ఒకే ఫ్రేములోకి వచ్చే విధంగా తయారు చేస్తున్నారు. తలపై మహా సర్పం నీడలో కైలాసంలో శివుడు, పార్వతి, కుమారస్వామి, అయ్యప్ప ఉంటారు.
     
    వినాయకుడి పక్కన ఒకవైపు సిద్ధి, మరోవైపు బుద్ధి విగ్రహాలను రూపొందిస్తున్నారు. 20 అడుగుల ఎత్తు, 18 అడుగుల వెడల్పుతో కుడివైపు లక్ష్మీ నృసింహ స్వామి, ఎడమ వైపు దుర్గామాత విగ్రహాలు ఉంటాయి.
     
     ఇప్పటి వరకు విగ్రహానికి సంబంధించిన 60 శాతం పనులు పూర్తయ్యాయి.
     
     ఈ నెల 12వ తేదీలోగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పనులు పూర్తవుతాయి. 15 నుంచి రంగులు వేస్తారు.
     
     ఆగస్టు 29 (వినాయక చవితి)కి నాలుగు రోజుల ముందే పనులు పూర్తి కానున్నాయి.
     
    మహాగణపతి మొదటి రోజు పూజలకు రాష్ట్ర ముఖ్యమంత్రిని, గవర్నర్ దంపతులను ఆహ్వానిస్తున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు. మహిళలు ప్రత్యేకంగా వారికి బోనాలతో స్వాగతం పలుకుతారని చెప్పారు.
     
    వినాయకుని తయారు చేసేందుకు ఇప్పటి వరకు రూ.30 లక్షలు ఖర్చయిందని, మరో రూ.పది లక్షలకు పైగా ఖర్చు కానుందని వెల్లడించారు.
     
    ప్రసాదాన్ని విక్రయించే ప్రసక్తే లేదు..

    ఖైరతాబాద్ మహాగణపతికి ఈ ఏడాది కూడా తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ నిర్వాహకుడు మల్లిబాబు 5 వేల కిలోల లడ్డూను సమర్పించేందుకు సిద్ధమయ్యారు. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు స్పష్టమైన హామీ ఇవ్వగానే తయారీ పనులు చేపడతానని ఆయన చెప్పారు. శిల్పి రాజేంద్రన్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ ఈ విషయమై మాట్లాడుతూ ఐదు వేల కిలోల బరువు మోసేందుకు అనుగుణంగా మహాగణపతి చేతి నిర్మాణాన్ని పూర్తి చేశామన్నారు. లడ్డూ బరువులో సగభాగం భక్తులకు పంపిణీ చేస్తామని, మిగిలిన సగభాగం ప్రసాద దాతకే ఇస్తామన్నారు. అంతేగానీ ప్రసాదాన్ని విక్రయించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement