- సర్వే రోజు వచ్చే కుటుంబమూ నమోదు
- 100 శాతం లక్ష్యంగా సర్వే చేయండి
- ప్రత్యేకాధికారి పార్థసారథి
ముకరంపుర : ఒక్క ఇల్లు కూడా వదలకుండా 100 శాతం సర్వే పూర్తి చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్, సర్వే జిల్లా ప్రత్యేకాధికారి పార్థసారధి అన్నారు. మండల ప్రత్యేకాధికారులు సంబంధిత మండలాలకు వెళ్లి పర్యవేక్షించాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సర్వేపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ప్రత్యేకాధికారులు తమ మండలాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. నోషనల్ నంబర్లు వేసినప్పుడు తాళం వేసి ఉండి సర్వే రోజున కుటుంబసభ్యులు ఉన్నట్లయితే ఆ ఇంటికి నంబర్ వేసి సర్వేలో కుటుంబసభ్యుల పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గస్థాయి అధికారులు, మండల ప్రత్యేకాధికారులు 17 నుంచి నియోజకవర్గాల్లో ఉండి పనులు పర్యవేక్షించాలని ఆదేశించారు. సమన్వయంతో పనిచేసి పకడ్బందీగా సర్వే నిర్వహించాలని చెప్పారు. ఎన్యుమరేటర్లు బలహీనంగా ఉన్నచోట ప్రత్యేకాధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు.
18న రిపోర్టు చేయాల్సిందే : కలెక్టర్
ఎన్యుమరేట్లు 18న మధ్యాహ్నం 2 గంటల వరకు తమకు కేటాయించిన గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసరుకు రిపోర్టు చేయాలని కలెక్టర్ ఎం. వీరబ్రహ్మయ్య ఆదేశించారు. గ్రామంలో పర్యటించి అవగాహన ఏర్పర్చుకోవాలన్నారు. 19న ఉదయం 7 గంటలకు మొదటి ఇంటిలో సర్వే మొదలు పెట్టాలని చెప్పారు. సర్వే పూర్తయ్యాక అదే రోజు ఫారాలను సంబంధిత పర్యవేక్షకులకు అందజేయాలని ఆదేశించారు. 17న డీఆర్డీఏ పీడీ నుంచి సర్వే ఫారాలను ఆర్డీవోలు తీసుకుని తహశీల్దార్లకు అందజేయాలన్నారు. ఎన్యుమరేటర్లు తక్కువగా ఉంటే ప్రైవేట్ టీచర్లను, విద్యార్థులను సర్వే కోసం నియమించుకోవాలని సూచించారు. నోషనల్ నంబర్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు.
సామాజిక, ఆర్థిక పరిస్థితి తెలుసుకునేందుకే సర్వే
తెలంగాణ రాష్ట్ర సామాజిక, ఆర్థిక పరిస్థితి తెలుసుకునేందుకే 19న ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు ప్రత్యేకాధికారి పార్థసారథి తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో కుటుంబ సర్వే ఎన్యుమరేటర్లకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. వాస్తవ సమాచారం సేకరించాలన్నారు. సంక్షేమ పథకాల ప్రారంభానికి ప్రణాళికల కోసం ఈ సర్వే ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సంచార జాతులు, అనాథల వివరాలు, భిక్షాటన చేసే వారి వివరాలు తప్పకుండా సేకరించాలన్నారు. కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ సర్వే రోజున ఇళ్లలో ఉన్న వారి వివరాలు మాత్రమే నమోదు చేసుకోవాలని, లేని వారి పేర్లు నమోదు చేయవద్దని చెప్పారు. 19న ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల్లో 30 కుటుంబాల వివరాలు సేకరించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీకేష్ లాట్కర్, రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రశేఖర్, తహసీల్దార్ జయచందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏర్పాట్లు పూర్తి
ఇంటింటి సర్వేకు ఏర్పాట్లు పూర్తయినట్లు కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 9,74,319 ఇళ్లు ఉండగా సర్వే కోసం నోషనల్ నంబర్ల ప్రకారం 11,80,254 ఇళ్లు ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. 43,276 మంది ఎన్యుమరేటర్లకు శిక్షణ పూర్తయిందని 1356 గ్రామ పంచాయతీ సమన్వయ అధికారులను నియమించామని స్పష్టం చేశారు. ప్రజలు ఎన్యుమరేటర్లకు సహకరించాలని కోరారు.
విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు
రాంనగర్ : సమగ్ర సర్వే కోసం 18, 19 తేదీల్లో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.లింగయ్య తెలిపారు. ఉపాధ్యాయులు ఈ నెల 18న వారివారి మండల కేంద్రాల్లో తహశీల్దార్‌కు రిపోర్టు చేయాలని సూచించారు. ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన అన్ని బస్సులను వారి మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయంలో ఉదయం 11 గంటల వరకు అందుబాటులో ఉంచాలని సూచించారు.
సర్వేకు సహకరించాలి : ట్రస్మా
జిల్లాలో జరిగే సమగ్ర సర్వేకు జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు సహకరించాలని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు కోరారు. పాఠశాలల బస్సులను మండల తహశీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
ఒక్క ఇల్లూ వదలొద్దు
Published Sun, Aug 17 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM
Advertisement
Advertisement