
‘మల్లన్న’కు మేమూ భూములిస్తాం
సిద్దిపేట జోన్ : మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం తాము కూడా భూములు ఇస్తామని మెదక్ జిల్లా కొండపాక మండలం ఎర్రవల్లి గ్రామస్తులు ముందుకు వచ్చారు. గురువారం సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన ఎర్రవల్లి గ్రామస్తులతో మంత్రి హరీశ్‌రావు జరిపిన చర్చలు సఫలీకృతమయ్యాయి. 70 శాతం మంది రైతులు జీవో 123 ప్రకారం భూములను ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు మంత్రికి రైతులు అంగీకారపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి భూమిని ఇచ్చిన భూ నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని, వారందరికి ప్రభుత్వ తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు.
భూ నిర్వాసితుల జీవన ప్రమాణాలు మరింత మెరుగయ్యేలా ప్రభుత్వం ప్రణాళికను రూపొందిస్తుందని చెప్పారు. ఎర్రవల్లి రైతులకు రుణపడి ఉంటామని, వారికి ఎంత చేసినా తక్కువేనని, వారి త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు. ప్రతిపక్షాల కుట్రలన్నీ కారుమబ్బుల్లాంటివన్నారు.
సీఎం, మంత్రిపై విశ్వాసం
మల్లన్నసాగర్ రిజర్వాయర్‌తో నాలుగు జిల్లాలు సస్యశ్యామలం అవుతున్నాయని, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుపై విశ్వాసంతో తాము భూములిచ్చేందుకు మనస్ఫూర్తిగా ఒప్పకున్నామని ఎర్రవల్లి గ్రామస్తులు తెలిపారు. ఆర్డీవో కార్యాలయంలో జీవో 123 కింద ప్రాజెక్టు నిర్మాణానికి స్వచ్ఛందంగా భూమిని ఇస్తున్నట్లు అంగీకార పత్రాలను అందజేసి మీడియాతో వారు మాట్లాడారు.