తుర్కయంజాల్ (హైదరాబాద్) : ప్రేమిస్తున్నానని మాయమాటలతో బాలికను నమ్మించి ఆమె నుంచి బంగారం, నగదును కాజేసిన ఓ మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ భాస్కర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం బోవిన్‌పల్లి గ్రామానికి చెందిన మేడ అరుణ్‌రెడ్డి(24) ... మహబూబ్‌బాషా, మల్లికార్జున్‌రెడ్డి, అర్జున్‌రెడ్డి తదితర పేర్లు చెప్పుకునేవాడు. వృత్తి రీత్యా కారు డ్రైవర్ అయిన అతడు హైదరాబాద్ బీఎన్‌రెడ్డి నగర్‌కు చెందిన ఇంటర్ చదువుతున్న ఓ బాలికతో గత ఏడాది నుంచి పరిచయం పెంచుకున్నాడు. అనంతరం ఫేస్‌బుక్, ఫోన్ ద్వారా చాటింగ్ చేస్తూ ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్తూ వచ్చాడు. తరువాత కొన్ని రోజులకు అరుణ్‌రెడ్డి.. తనకు ఆరోగ్యం బాగాలేదని, డాక్టర్‌కు చూపించుకుంటానని నమ్మబలికాడు. ఇందుకుగాను ఇంటి నుంచి డబ్బు తీసుకువచ్చి ఇవ్వాలని బాలికను కోరగా ఆమె స్పందించలేదు. దీంతో అరుణ్‌రెడ్డి ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని అందరికీ చెప్పి పరువు తీస్తానని బెదిరించడంతో బాలిక తల్లికి చెందిన సుమారు 30 తులాల బంగారు ఆభరణాలు, బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డుల ద్వారా రూ.3.50 లక్షల నగదును ఇచ్చింది. అనంతరం బంగారు ఆభరణాలలో కొన్నింటిని అమ్ముకొని మిగతా నగదును మొత్తం జల్సాలకు వాడుకున్నాడు.
కాగా ఆభరణాలు, నగదు అరుణ్‌రెడ్డికి ఇచ్చిన విషయం తల్లిదండ్రులకు తెలిస్తే కోప్పడతారని భావించిన బాలిక ఫిబ్రవరి 2వ తేదీన రాత్రి సమయంలో కుటుంబసభ్యులు ఇంట్లో టీవీ చూస్తుండగా బెడ్‌రూంలో చదువుకుంటున్నట్లు నటిస్తూ తనకు తానుగా చేతులు, కాళ్ళు కట్టేసుకుని నోట్లో గుడ్డలు కుక్కుకుని ఇంట్లో వారికి వినిపించేలా అరిచింది. దొంగలు వచ్చి తనను ఈ విధంగా కట్టిపడేసి ఇంట్లోని బంగారు ఆభరణాలు తీసుకుపోయారని కుటుంబ సభ్యులకు తెలిపింది. ఇది నిజమేనని నమ్మిన బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం విచారణ చేపట్టిన పోలీసులకు అసలు విషయాలు తెలిశాయి. దీంతో వారు బాలికను ప్రేమ పేరుతో నమ్మించి నగదు, బంగారు ఆభరణాలు తీసుకున్న అరుణ్‌రెడ్డిని మంగళవారం అరెస్ట్ చేశారు. అతడి నుంచి 16 తులాల బంగారు ఆభరణాలు రాబట్టగలిగారు. అనంతరం తప్పుడు కేసు పెట్టినందుకు గాను బాలిక, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ను ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు జరుగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై దృష్టి సారించాలని ఏసీపీ తెలిపారు.
ప్రేమపేరుతో బాలిక నుంచి ఆభరణాలు కాజేశాడు
Published Tue, Jun 9 2015 8:35 PM | Last Updated on Mon, Apr 8 2019 6:21 PM
Advertisement
Advertisement