జూదమాడుతూ పోలీసుల కంటబడటంతో తప్పించుకోబోయి బాల్కనీ నుంచి ఇద్దరు వ్యక్తులు జారి పడ్డారు.
హైదరాబాద్: జూదమాడుతూ పోలీసుల కంటబడటంతో తప్పించుకోబోయి బాల్కనీ నుంచి ఇద్దరు వ్యక్తులు జారి పడ్డారు. వీరిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ ఎంఐజీ బస్‌స్టాప్ సమీపంలోని ఓ భవనం రెండో అంతస్తులో బుధవారం అర్ధరాత్రి ఆరుగురు వ్యక్తులు జూదమాడుతున్నారు. శబ్దాలు రావడంతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు ఆ ఫ్లాట్‌కు వెళ్లి తలుపు తట్టారు. దీంతో ఒక వ్యక్తి డోర్ తీయగా, పేక ముక్కలు తీసివేసి అందరూ నిలబడ్డారు.
అర్ధరాత్రి ఏం చేస్తున్నారని పోలీసులు ప్రశ్నించగా భయాందోళనకు గురైన శ్రీనివాస్ (36), పి.శ్రీను(40)లు వెనుక వైపున్న బాల్కనీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వీరిద్దరూ జారి కింద పడిపోయారు. తీవ్ర గాయాలపాలైన వారిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందాడు. కాగా, మరో నలుగురిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద ఉన్న రూ.1,200 లను సీజ్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ కుషాల్కర్ తెలిపారు.