
అంబులెన్స్ డోర్ ఎంతపని చేసింది....
సాక్షి, హైదరాబాద్ : అంబులెన్స్ డోర్ తెరుచుకోవటం ఆలస్యమవటంతో ఓ గుండె శాశ్వతంగా ఆగిపోయింది. ప్రాణం పోసే అంబులెన్స్ పనితీరు కారణంగా ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. అల్మాస్ గూడకు చెందిన ఆనంద్ (50) బేగంపేటలో కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు. బేగంపేట నుంచి ఫలక్‌నుమాకు ఎంఎంటీఎస్‌లో వెళ్తున్న సమయంలో మలక్‌పేట స్టేషన్ వద్ద ఆనంద్ గుండెపోటుకు గురయ్యాడు. దీంతో ప్రయాణికులు 108కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అంబులెన్స్ వద్దకు ఆనంద్‌ను తీసుకెళ్లగా అబులెన్స్ డోర్ లాక్‌పడి ఉండటంతో అది ఓపెన్ కాలేదు. అబులెన్స్ అద్దాలు పగుల గొట్టేందుకు 20 నిముషాల సమయం పట్టింది.
ఈ లోపు ఆనంద్ చనిపోయాడు. దీనిపై తోటి ప్రయాణికుడు మజర్ మాట్లాడుతూ.. అతన్ని కాపాడటానికి ఎంతో ప్రయత్నించాం. కాళ్లు, చేతులు రుద్దుతూ సపర్యలు చేశాము. అంబులెన్స్ సిబ్బంది కూడా ఎంతో సహాయం చేశారు. సమయానికి డోర్ తెరుకోక ఇంజక్షన్ ఇవ్వలేకపోయారు. చివరకు ఆనంద్ మృత్యువాత పడ్డాడు’’అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.