నకిలీ ఫేస్‌బుక్‌లో అశ్లీల దృశ్యాలు..అరెస్ట్
హైదరాబాద్ : వివాహితపై కన్నేసిన యువకుడు రకరకాలుగా వేధిస్తూ నరకం చూపించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్‌క్రైమ్ ఇన్‌స్పెక్టర్ ఎస్.రాజశేఖరరెడ్డి నిందితుడిని శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. క్రైమ్స్ అదనపు డీసీపీ బి.శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా తుక్కుగూడకు చెందిన బేగరి ప్రవీణ్‌కుమార్ (32) జులాయి. అదే గ్రామానికి చెందిన వివాహిత (30) తన కుమార్తెను పాఠశాలకు తీసుకెళ్లి వచ్చే సమయంలో ప్రవీణ్ పరిచయం చేసుకున్నాడు. అతని పద్ధతి బాగోలేకపోవడంతో ఆమె మాట్లాడటం మానేసింది.
ఇది మనసులో పెట్టుకున్న ప్రవీణ్.. ఓ కళాశాలో చదువుకుంటున్న ఆమెకు ... ప్రిన్సిపాల్‌తో వివాహేతర సంబంధం ఉందని గోడలపై రాతలు రాశాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె చదువు మానేసి ఇంట్లోనే ఉంటోంది. ప్రిన్సిపాల్ అప్పట్లో ఈ విషయంపై పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే విచారణలో నిందితుడుని గుర్తించలేదు. దీంతో తనను ఎవరు పట్టుకోలేరని భావించిన ప్రవీణ్...ఆమె సెల్‌ఫోన్ నెంబర్లు సులభ్ కాంప్లెక్స్ గోడలపై రాశాడు.
దీంతో పలువురు ఆ నెంబర్‌కు ఫోన్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఆమె పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ను కూడా తెరచి అశ్లీల దృశ్యాలను అందులో పెట్టాడు. ఆమె సెల్‌ఫోన్‌కు కూడా అసభ్యకరమైన ఎస్‌ఎంఎస్‌లు చేశాడు. అతని వేధింపులు భరించలేని బాధితురాలు గతనెల 3న సైబరాబాద్ సైబర్‌క్రైమ్ ఏసీపీ ఎస్.జయరాంకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన ఇన్‌స్పెక్టర్ రాజశేఖరరెడ్డి నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.