మేడారం.. అన్నీ ‘ప్రత్యేకం’ | Medaram Jatara Many Specialties | Sakshi
Sakshi News home page

మేడారం.. అన్నీ ‘ప్రత్యేకం’

Published Thu, Feb 6 2020 2:12 AM | Last Updated on Thu, Feb 6 2020 2:12 AM

Medaram Jatara Many Specialties - Sakshi

ఆదివాసీల అతి పెద్ద జాతర.. దక్షిణాది కుంభమేళ.. మేడారం జాతర ఎన్నో ప్రత్యేకతలకు నెలవు. ప్రతి అంశం వెనుక ఓ చరిత్ర ఉంది. ప్రతి ప్రక్రియకు ప్రత్యేకత ఉంది. ఒక్కో ఊరికి ఒక్కో చరిత్ర. వనదేవతలుగా ప్రసిద్ధికెక్కిన ఒక్కొక్కరిదీ ఒక్కో వీరగాథ. మేడారంలోని కీలక అంశాలపై ప్రత్యేక కథనం..

పగిడిద్దరాజు గుడి.. పూనుగొండ్ల 
మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలంలో పూనుగొండ్ల గ్రామం ఉంది. ఇక్కడ సమ్మక్క భర్త పగిడిద్దరాజు గుడి ఉంది. మేడారం, పూనుగొండ్ల మధ్య దూరం నలభై కిలోమీటర్లు. సమ్మక్క భర్త పగిడిద్దరాజును పూనుగొండ్ల నుంచి మేడారానికి తీసుకువస్తారు. పెనక వంశానికి చెందిన పగిడిద్దరాజును అదే వంశానికి చెందిన పెనక బుచ్చి రామయ్య అనే పూజారి పూనుగొండ్ల గ్రామం నుంచి కాలినడకన తీసుకువస్తారు. 

వెన్నెలక్క నెలవు.. కన్నెపల్లి 
తాడ్వాయి మండలంలోని ఊరట్టం గ్రామపంచాయతీ పరిధిలో కన్నెపల్లి గ్రామం ఉంది. ఈ గ్రామంలోనే వెన్నెలమ్మగా పిలిచే సారలమ్మ ఆలయం ఉంది. జాతర సమయంలో ఇక్కడి నుంచి జంపన్నవాగు మీదుగా మేడారంలోని గద్దెల వరకు సారలమ్మను ఆదివాసీ పూజారులు తీసుకొస్తారు. ఈ ఊరి జనాభా 282 మంది. ఈ గ్రామ ప్రజలు ఏం చేయాలన్నా సారలమ్మ ఆశీర్వాదం తప్పనిసరి. ‘మా వెన్నెలక్కకు సెప్పకుంటే ఇగ అంతే.. అమ్మో.. సారక్కకు చెప్పే సేత్తం’అంటారు ఇక్కడి ఆదివాసీలు.


 

మారేడు చెట్ల మేడారం
80 కుటుంబాలు ఉన్న చిన్న పల్లె ఇది. సమ్మక్క–సారలమ్మ జాతర ప్రధాన కేంద్రమైన గద్దెలు ఈ గ్రామంలోనే ఉన్నాయి. ఈ గ్రామంలో సమ్మక్కకు ఆలయం ఉంది. జాతరలో కీలక ప్రాంతాలైన చిలకలగుట్ట, జంపన్నవాగు సైతం ఈ గ్రామ సమీపంలోనే ఉన్నాయి. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రం నుంచి 110 కిలోమీటర్ల దూరంలో మేడారం ఉంటుంది. అటవీ ప్రాంతంలోని తాడ్వాయి మండలం ఊరట్టం పంచాయతీ పరిధిలో ఈ ఊరు ఉంటుంది. మారేడు చెట్లు ఎక్కువగా ఉన్నందున ఈ ఊరికి మేడారం అని పేరు వచి్చనట్లు చెబుతుంటారు. ఇక్కడ కోయ వర్గానికి చెందిన గిరిజన కుటుంబాలే ఎక్కువ. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం, ఉత్పత్తుల సేకరణ.  

విలుకాడు... గోవిందరాజు 
సారలమ్మ భర్త గోవిందరాజు. దబ్బగట్ల వంశానికి చెందిన గోవిందరాజు.. మేడారానికి వచ్చిన సమయంలోనే కాకతీయులతో యుద్ధం జరిగింది. విలువిద్యలో ఆరితేరిన గోవిందరాజు యుద్ధంలోనే వీరమరణం పొందారు.

సారలమ్మ.. 
సమ్మక్క కూతురు సారలమ్మ. తల్లికి తగ్గ తనయ. కాకతీయులతో జరిగిన యుద్ధంలో మేడారం నుంచి కన్నెపల్లి వైపు వెళ్లిన సారలమ్మ ఆ ప్రాంతంలోనే వీరమరణం పొందారు. దీంతో అక్కడివారు తమ ఇలవేల్పుగా కొలుస్తున్నారు. సమ్మక్క ఆగమనానికి ముందురోజు కన్నెపల్లి గ్రామంలోని సారలమ్మ గుడిలో ప్రధాన పూజారి ప్రత్యేక పూజలు చేస్తారు.  

బయ్యక్కపేట, చందా వంశీయులు... ఇదో ఘట్టం 
కొందరి పరిశోధనల ప్రకారం... మేడారంలో కొలువు తీరిన సమ్మక్కకు బయ్యక్కపేటలోనూ చరిత్ర ఉంది. ఈ మేడారం జాతరను మొదట బయ్యక్కపేటలోనే నిర్వహించేవారు. ఈ బయ్యక్కపేట మేడారానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. చందా వంశపు కోయ గిరిజనుల ఆడబిడ్డగా సమ్మక్క బయ్యక్కపేటలోనే జన్మించినట్లు ప్రచారంలో ఉంది. 

గోవిందరాజు ఇలాకా.. కొండాయి
ఏటూరునాగారం మండలంలో కొండాయి గ్రామం ఉంది. సారలమ్మ భర్త గోవిందరాజు ఆలయం ఇక్కడే ఉంది. మేడారం, కొండాయి గ్రామాల మధ్య దూరం పన్నెండు కిలోమీటర్లు. జాతర సందర్భంగా వడ్డెలు, తలపతి, వర్తోళ్లు కలసి డోలు చప్పుళ్లతో కాలినడకన మేడారం చేరుకుంటారు.

 

సంపెంగవాగే  ‘జంపన్న’వాగు
సమ్మక్క కుమారుడు జంపన్న. కాకతీయులతో జరిగిన యుద్ధంలో శుత్రువు చేతికి చిక్కి చావడం ఇష్టంలేని జంపన్న అక్కడికి సమీపంలోని సంపెంగవాగులో దూకి చనిపోయాడు. అప్పటి నుంచి ఈ వాగును జంపన్న వాగుగా పిలుస్తారు. మేడారం జాతరకు వచ్చే భక్తులు ఈ వాగులో స్నానాలు చేసిన తర్వాతే వన దేవతలకు మొక్కులు సమర్పిస్తారు.

 

అందరి మాత.. సమ్మక్క 
కరీంనగర్‌ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని ‘పొలవాస’ను 12 శతాబ్దంలో గిరిజన దొర మేడరాజు పాలించాడు. వేట కోసం ఒకసా రి అభయారణ్యం  వెళ్లాడు. అక్కడ పులుల సంరక్షణలో, దివ్యకాంతులతో ఉన్న బాలికను చూసి గ్రామానికి తీసుకొచ్చారు. సమ్మక్క అని పేరు పెట్టారు. యుక్త వయసు వచ్చిన సమ్మక్క.. మేడారాన్ని పరిపాలించే పగిడిద్దరాజును వివాహమాడిం ది. పగిడిద్దరాజు మేడరాజుకు మేనల్లుడు. పగిడిద్దరాజు – సమ్మక్కకు సారలమ్మ, నా గులమ్మ కుమార్తెలు, జంపన్న కుమారుడు. సారలమ్మకు గోవిందరాజుతో పెళ్లయింది.   

– గడ్డం రాజిరెడ్డి, సాక్షి ప్రతినిధి, వరంగల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement