
నగర మెట్రో భేష్
మెట్రో రైలు టెస్ట్ రన్‌లో శ్రీధరన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర మెట్రో ప్రాజెక్టు మెట్రోగురు శ్రీధరన్ మెప్పు పొందింది. పనుల నాణ్యత, ప్రమాణాలు అత్యున్నతంగా ఉన్నాయని ప్రశంసించారు. సోమవారం ఢిల్లీ మెట్రో రైలు మాజీ ఎం.డి. ఇ.శ్రీధరన్ నాగోల్ మెట్రో డిపో నుంచి సర్వే ఆఫ్ ఇండియా వరకు నిర్వహించిన మెట్రో రైలు టెస్ట్న్‌ల్రో పాల్గొన్నారు. మెట్రో రైళ్ల పనితీరును పరిశీలించారు. నాణ్యత, ప్రమాణాలు బాగా ఉన్నాయన్నారు. ప్రయాణం సౌకర్యవంతం, విలాసవంతంగా ఉందని కొనియాడారు. నాగోల్ స్టేషన్, ఉప్పల్ మెట్రో డిపోలోని వసతులపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మెట్రో ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయాలని హెచ్‌ఎంఆర్, ఎల్ అండ్ టీ అధికారులకు సూచించారు. ఒకే పిల్లర్‌పై విభిన్న రూపాల్లో నిర్మిస్తున్న మెట్రో స్టేషన్ డిజైన్లను శ్రీధరన్ ఆసక్తిగా పరిశీలించారు. వయాడక్ట్ నిర్మాణాలను ఆసక్తిగా పరిశీలించారు. పనులు వేగవంతం అయ్యేందుకు ఈ టెక్నాలజీ దోహదం చేస్తుందన్నారు. నగర మెట్రో ప్రాజెక్టు పూర్తయ్యే వరకు విలువైన సూచనలు, సలహాలు అందించాలని హెచ్‌ఎంఆర్ ఎం.డి. ఎన్వీఎస్‌రెడ్డి శ్రీధరన్‌ను కోరగా సానుకూలంగా స్పందించారు.
విశాఖ, వీజీటీఎంలలోనూ మెట్రో పరుగులు
విశాఖపట్నంలోను, విజయవాడ, గుంటూరు, తెనాలి పట్టణాభివృద్ధి సంస్థ (వీజీటీఎం) పరిధిలో నిర్మించే మెట్రో రైలు ప్రాజెక్టులను మూడున్నరేళ్లలో పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ)కి అప్పగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. సోమవారం అసెంబ్లీలోని కార్యాలయంలో చంద్రబాబుతో ఢిల్లీ మెట్రో రైల్ రూపకర్త, డీఎంఆర్‌సీ మాజీ ఎండీ ఇ. శ్రీధరన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేపట్టే మెట్రో రైల్ ప్రాజెక్టులకు సలహాదారుగా ఉండాలని శ్రీధరన్‌ను సీఎం కోరారు. అందుకు ఆయన అంగీకరించారు. తిరుపతిలో కూడా మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. దాని సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని శ్రీధరన్‌ను కోరారు.