
బుధవారం ఐఐటీహెచ్ వద్ద ఆందోళన చేస్తున్న వలస కార్మికులు
సాక్షి, సంగారెడ్డి/సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి జిల్లా లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్)లో భవన నిర్మాణ పనులకోసం వచ్చిన వలస కార్మికులు బుధవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిర్మాణ సంస్థలు 3 నెలలుగా జీతాలు ఇవ్వడంలేదని, తమను సొంత రాష్ట్రాలకు వెళ్లనివ్వడం లేదని, భోజనం కూడా సక్రమంగా పెట్టడం లేదని వారు ఆందోళన చేపట్టారు. బుధవారం నుంచి తిరిగి నిర్మాణ పనులకు రావాలని ఎల్‌అండ్‌టీ కంపెనీ ప్రతినిధులు కార్మికుల వద్దకు వెళ్లి కోరడం వారి ఆందోళనకు ఆజ్యం పోసింది. కార్మికులు ఒక్కసారిగా కంపెనీ ప్రతినిధులపై తీవ్ర ఆగ్రహంతో తిరగబడటంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సంగారెడ్డి రూరల్ పోలీసులు కార్మికులు నివాసం ఉండే ప్రాంతానికి వెళ్లడంతో కోపోద్రిక్తులైన కార్మికులు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఒక ఏఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసు వాహ నం ధ్వంసమైంది. ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్న ఎస్‌ఐ శ్రీకాంత్ వెంటనే ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డికి సమాచారం అందించారు. దీంతో ఆయన పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఏడాదికాలంగా పనులు..: సంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్నాపూర్ సమీపంలోని ఐఐటీహెచ్ క్యాంపస్‌లో రెండోదశ భవన నిర్మాణం పనులు సంవత్సరకాలంగా జరుగుతున్నాయి. ఎల్‌అండ్‌టీ, షాపూర్‌జీ సంస్థలు ఈ పనులు చేస్తున్నాయి. ఇందుకోసం బిహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి 2,400 మంది కార్మికులను తీసుకొచ్చారు. వీరికి పనిని బట్టి రూ.10 నుంచి రూ.20 వేల వరకు జీతం ఇస్తున్నారు. ఈ కార్మికులకు చిమ్నాపూర్ సమీపంలోనే నివాసాలు ఏర్పాటు చేశారు. మార్చి 23 నుంచి లాక్‌డౌన్ అమలులో ఉన్నందున నిర్మాణ పనులు పూర్తిగా నిలిపివేశారు. అప్పటి నుంచి కార్మికులు పనులు లేకుండానే ఉంటున్నారు. కంది మండల పరిధిలో ఉన్న అక్షయపాత్ర సంస్థ ద్వారా ప్రతి రోజు మధ్యాహ్నం ఒక పూట వారికి భోజనం అందిస్తున్నారు. రాత్రి భోజనం వారే తయారు చేసుకుంటున్నారు.
నెలరోజులకుపైగా చాలీచాలని తిండి తినడం, అలాగే మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులు ఆగ్రహంతో ఉన్నారు. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నుంచి కొన్ని పనులకు సడలింపు ఇవ్వడంతో ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు తిరిగి నిర్మాణం చేపట్టడానికి బుధవారం ఉదయం కార్మికుల ను పనులకు పిలిచారు. అసలే జీతాలు లేక చాలీచాలని తిండితింటూ ఆగ్రహంగా ఉన్న కార్మికులు ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు పనులకు పిలవడంతో ఆం దోళనకు దిగారు. వెంటనే జీతాలు చెల్లించి తమను ఇంటికి పంపించాలని డిమాండ్ చేశారు.
2,400 మంది కార్మికులు ఒకేసారి ఆందోళనకు దిగడంతో ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన పోలీసులను చూడగానే ఆగ్రహంతో రెచ్చిపోయిన కార్మికులు రాళ్లు, కర్రల తో దాడులు చేశారు. రెండు గంటల పాటు ఏం జరుగుతుందో తెలియని ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా రూరల్ ఏఎస్‌ఐ సంగమేశ్వర్‌తో పాటుగా ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. దీంతో ఎస్‌ఐ శ్రీకాంత్, సీఐ శివకుమార్‌లు వెంటనే ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డికి సమాచారం అందించారు. ఆయన 200 మంది సిబ్బందితో ఐఐటీకి చేరుకొని పరిస్థితిని అదుపులోనికి తెచ్చారు. స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం అక్కడకు వచ్చి కార్మికులతో మాట్లాడారు.
60 మందిపై కేసులు..
ఐఐటీ హైదరాబాద్ పరిసరాల్లో ఆందోళనకు దిగిన వలస కార్మికులను కట్టడి చేసేందుకు వెళ్లిన పోలీసులపై దాడి చేసిన పలువురిపై కేసులు నమోదు చేసినట్లు సంగారెడ్డి రూరల్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. హత్యాయత్నం, ప్రభుత్వ వాహనాన్ని ధ్వంసం చేయడం, ప్రభుత్వ అధికారిపై దాడి చేయడం, లాక్‌డౌన్ ఉత్తర్వులు ఉల్లంఘించినందుకు ఆయా సెక్షన్ల కింద 60 మంది కార్మికులపై కేసులు నమోదు చేశామని ఆయన చెప్పారు.
కలెక్టర్, ఎస్పీ చర్చలు..
పరిస్థితిని గమనించిన ఎస్పీ ఈ విషయాన్ని కలెక్టర్ హనుమంతరావుకు తెలియజేశారు. ఆయన సూచన మేరకు ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు, కార్మికుల తరఫున ఆరుగురు ప్రతినిధులను కలెక్టరేట్‌కు తీసుకెళ్లి వారితో చర్చలు జరిపారు. తమకు వెంటనే జీతాలు చెల్లించి స్వస్థలాలకు పంపించా లని కార్మికులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. కాగా లాక్‌డౌన్ ఉన్నందున స్వస్థలాలకు వెంటనే పంపించడం సాధ్యం కాదని ఆయన వివరించారు. పెండింగ్ జీతాలు మాత్రం గురువారం సాయంత్రంలోగా చెల్లించే విధంగా ఎల్‌అండ్ టీ ప్రతినిధులను ఆదేశించారు. కంపెనీ ప్రతినిధులు జీతాల చెల్లింపునకు అంగీకరించడంతో కార్మికులు శాంతించారు. దీంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఐఐటీహెచ్‌లో కార్మికుల పరిస్థితి, వసతులను నిరంతరం పర్యవేక్షిస్తామని, అక్కడ పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేస్తామని కలెక్టర్, ఎస్పీలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment