బాబు బుద్ధి మందగించింది
నోటికొచ్చినట్టు మాట్లాడడం సరికాదు: మంత్రి హరీశ్‌రావు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఏపీ సీఎం చంద్రబాబు పచ్చి అవకాశవాది అని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. టీడీపీ లేకుంటే కేసీఆర్ సిద్దిపేటలో గొర్రెలు కాసుకుంటూ బతికేవారని బాబు చేసిన విమర్శలకు హరీశ్‌రావు తీవ్రంగా ప్రతిస్పందించా రు. శుక్రవారం సంగారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బాబుకు వయసు పెరుగుతుంటే బుద్ధి మందగించి, విచక్షణ కోల్పోయి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు.
ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించినప్పుడు చంద్రబాబు కాంగ్రెస్‌లో ఉన్నారన్నారు.1982లో కేసీఆర్ టీడీపీలో చేరితే.. చంద్రబాబు 1983లో వచ్చారన్నారు. ఆయన రాజకీయల్లోకి వచ్చిన రోజున కేవలం రెండెకరాల వ్యవసాయ భూమి మాత్రమే ఉందని, ఈరోజు రూ. 2 వేల కోట్లు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. కేసీఆర్ పుట్టడమే మూడెకరాల బంగ్లాలో పుట్టారని, ఆయన రాజకీయాల్లోకి వచ్చాక తన ఇల్లును ప్రభుత్వ పాఠశాలకు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
తెలంగాణ ప్రాంతంలో వేలాది మంది యాదవ సోదరులు గొర్రెలు కాసుకొని జీవనం చేస్తున్నారని, గొర్రెలు కాయడం పాపం, అంటరానితనం అనే విధంగా బాబు మాట్లాడియాదవవుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. చంద్రబాబు వెంటనే యాదవులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.