గొడవపడిన సమీపంలోనే.. | Most wanted Terrorists Vikaruddin Killed | Sakshi
Sakshi News home page

గొడవపడిన సమీపంలోనే..

Published Wed, Apr 8 2015 4:29 AM | Last Updated on Sat, Sep 2 2017 11:59 PM

Most wanted Terrorists Vikaruddin Killed

పెనుగులాటలో ఆర్‌ఎస్‌ఐ చేతికి గాయాలు
     సంఘటనా స్థలిని సందర్శించి ఐజీ, డీఐజీ
 జనగామ : జిల్లా సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో హైదరాబాద్ సహా పలు పేలుళ్ల నిందితుడు వికారుద్దీన్ ముఠా హతమైంది. వికారుద్దీన్‌తో పాటు మరో నలుగురు మృతి చెందారు. జిల్లా సరిహద్దు పెంబర్తి గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో నల్గొండ జిల్లా పరిధిలో మంగళవారం ఉదయం 10. 20 గంటలకు ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. 11-11- 2011న బిర్యానీ కావాలని గలాటాకు దిగిన ప్రాంతం సమీపంలోనే ఈ ఘటన జరిగింది. దీంతో ఒక్కసారిగా జిల్లా ఉలిక్కిపడింది. నల్లొండ జిల్లా సూర్యాపేట, జానకీపురం ఘటనలను మరువక ముందే ఈ ఉగ్రవాద ఎన్‌కౌంటర్ కలకలం రేపింది.
 
 ఎన్‌కౌంటర్ జరిగిందిలా..
 వరంగల్ కే ంద్ర కారాగారం నుంచి ఉదయం 8.30 గంటలకు వికారుద్దీన్‌తో సహా సయ్యద్ అమ్జద్‌అలీ అలియాస్ సులేమాన్(28), మహ్మద్ జకీర్(32), ఇజహర్‌ఖాన్(35), మహ్మద్ హనీఫ్(40)లనుహైదరాబాద్ 7వ మెట్రో పాలిటన్ కోర్టుకు తరలిస్తున్నారు. పది రోజులుగా వివిధ కేసుల్లో విచారణ నిమిత్తం వారిని కోర్టుకు తరలిస్తున్నారు. ఇదే క్రమంలో మంగళవారం ఉదయం ప్రత్యేక బస్సులో ఆర్‌ఎస్‌ఐ ఉదయభాస్కర్ మరో 16 మంది కానిస్టేబుళ్లు ఎస్కార్ట్‌గా హైదరాబాద్ బయల్దేరారు.
 
 పోలీసులను రెచ్చగొట్టడంలో దిట్టగా పేరొందిన వికారుద్దీన్ తన వికృత చేష్టలను ఖాజీపేట దాటగానే మొదలు పెట్టినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఎస్కార్ట్‌గా ఉన్న పోలీసుల కుటుంబసభ్యులను, పోలీసులను కించపరిచేలా మాట్లాడినట్లు సమాచారం. బస్సు ఉదయం 10.20 నిమిషాలకు వరంగల్ జిల్లా సరిహద్దు దాటింది. మూత్ర విసర్జనకు బస్సు ఆపారు. ఇదే సమయంలో వికారుద్దీన్ పోలీసులపై దూషణలకు దిగగా, పోలీసు లు వారించే ప్రయత్నం చేశారు. ఉగ్రవాదులకు పోలీసులకు మధ్య పెనుగులాట జరిగింది. వికారుద్దీన్ గన్‌ను లాక్కునే ప్రయత్నం చేయగా ఆత్మరక్షణ కోసం తమ పోలీసులు కాల్పులు జరుపగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు హైదరాబాద్ రేంజ్ ఐజీ నవీన్ చంద్ విలేకరులకు తెలిపారు.
 
 ఆద్యంతం హైడ్రామా
 ఎన్‌కౌంటర్ ఘటన ఆద్యంతం హైడ్రామాలా సాగింది. కవరేజ్ కోసం వెళ్లిన మీడియాపై పోలీసులు తీవ్ర ఆంక్షలు పెట్టారు. ఘటనాస్థలానికి చేరుకున్న హైదరాబాద్ రేంజ్ ఐజీ నవీన్‌చంద్, వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డి, ఎస్సీ అంబర్ కిశోర్‌ఝా, నల్గొండ ఎస్పీ విక్రం సింగ్ దుగ్గల్‌లు ఎన్‌కౌంటర్ తీరును పరిశీలించారు. మృత దేహాలను మధ్యాహ్నం 12.45 గంటలకు జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అండర్ ట్రయల్‌లో ఉన్న ఉగ్రవాదులు కావడంతో జడ్జి పర్యవేక్షణలోనే పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంది. ఆలేరు జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి మూడు గంటల ప్రాంతంలో ఆస్పత్రికి వచ్చారు.  
 
 పలుమార్లు సమాలోచనలు
 ఉగ్రవాదుల వ్యవహారం కావడంతో అధికారులు ఆచితూచి నిర్ణయాలు తీసుకున్నారు. జడ్జి తిరుపతితో కలిసి పోలీసులు ఆస్పత్రిలో సమావేశమై సంఘటనా వివరాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇక్కడే పోస్టుమార్టం నిర్వాహిస్తారని అధికారులు భావించగా చివరకు నిర్ణయం మారింది. మృతదేహాలను తరలించకుండా 5.30 గంటలకు శవపంచనామా ప్రారంభించారు. వరంగల్ నుంచి వచ్చిన వైద్య బృందం, ఫోరెన్సిక్ బృందం సభ్యులు జడ్జి తిరుపతి సమక్షంలో ఒక్కో మృత దేహాన్ని కిందకు దింపి రాత్రి 8 గంటల వరకు పంచనామా చేశారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య వరంగల్ ఎంజీఎంకు మృత దేహాలను తరలించారు.బుధవారం ఎంజీఎంలో పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఎన్‌కౌంటర్‌తో జిల్లా ఉలిక్కిపడింది. ఎన్‌కౌంటర్ మృతులను చూసేందుకు జనం ఘటనా స్థలానికి భారీగా చేరుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement