
సినిమా దేవుళ్లు!
ఫిలింనగర్‌లోని దైవసన్నిధానంలో కొలువైన దేవుళ్లకు సినిమా క్లాప్‌లు నిత్య కృత్యమయ్యాయి. ముహూర్తాల పూజలు, అర్చనలు, సినిమా హిట్ కావాలని ప్రత్యేక పూజలు ఇక్కడ సాధారణం. ఈ సన్నిధానంలో 17 మంది దేవతలు కొలువుదీరారు. వారంలో నాలుగు రోజుల పాటు తప్పని సరిగా ఏదో ఒక సినిమాకు సంబంధించి ప్రారంభోత్సవాలు, పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రముఖ హీరోలకు దైవసన్నిధానం కొంగు బంగారంగా విరాజిల్లుతోంది.
బంజారాహిల్స్: దైవసన్నిధానం సకల దేవతామూర్తుల ఆస్థానం. సినిమా వాళ్లకు ఇక్కడి దేవుళ్లు కోరిన కోర్కెలు తీచ్చే సర్వమంగళ స్వరూపులయ్యారు. ఇక్కడ క్లాప్ కొడితే సినిమా హిట్టే అని సినీ హీరోల నమ్మకం. 2002 సెప్టెంబర్ 3న ఈ ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. 2004 జూన్ 2న విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామీజీ చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ట - మహాకుంభాభిషేకాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ముహూర్త బలం - స్థల ప్రభావంతో అప్పటి నుంచి ఎంతో మంది భక్తులు ఇక్కడి దేవతామూర్తులను దర్శించి వారి కోరికలు నెరవేర్చుకొని ఆనందంతో తరిస్తున్నారు.
సినిమా సెట్టింగులను తలపించేలా...
దైవ సన్నిధానంలో దేవతామూర్తులను ప్రతిష్టించిన తీరు ఒక సినిమా సెట్టింగ్‌ను తలపిస్తున్నది. లోనికి వెళ్లగానే ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవుని దర్శనం కూడా అంతే ప్రశాంతంగా జరుగుతుంది. దేవతామూర్తులందరూ ఒకే చోట కొలువైన తీరు నగరంలో మరెక్కడా లేదు. ఇక్కడ శ్రీ మహావిష్ణు విశ్వరూపం ఒక అద్భుత దృశ్యంగా భక్తులకు కనిపిస్తున్నది. ఇక్కడ సినిమా తీస్తే అది సూపర్ హిట్ అనే టాక్ కూడా ఉంది. దీంతో నిర్మాతలు, హీరోలు ఇక్కడే తమ సినిమాల ముహూర్తాలను నిర్ణయించుకుంటున్నారు.
ఇప్పటి వరకు దైవసన్నిధానంలో 150 సినిమాల వరకు పూజా కార్యక్రమాలు, షూటింగ్‌లు జరుపుకొన్నాయి. చాలా మంది నిర్మాతలు తమ సినిమాలు చిన్న దృశ్యమైనా ఇక్కడ చిత్రీకరించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సినిమా షూటింగ్‌లకు కూడా ఇక్కడి వాతావరణం ఎంతో అనుకూలంగా ఉంటుండటంతో చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు.
సినిమాల్లో ఆలయాల దృశ్యాలను చూపేందుకు దైవసన్నిధానం ఎంతో అనుకూలంగా ఉందని దృశ్యాలు కూడా పండుతాయని పలువురు నిర్మాతలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోలతో పాటు యువ హీరోలందరి సినిమాలు ఏదో ఒక దృశ్యాన్ని ఇక్కడ చిత్రీకరించుకున్నవే. ఇటీవల రామ్‌చరణ్‌తేజ్ సినిమా కూడా ముహూర్త షాట్లు ఇక్కడే చిత్రీకరించుకోవడం కొసమెరుపు.