ఎంపీ స్థానం మాదిగకే..
భూ పంపిణీ కోసం సర్వే జరుగుతోంది
ఉప ముఖ్యమంత్రి కడియంశ్రీహరి
వరంగల్ ఎంపీ స్థానం ముమ్మాటికి మాదిగలకే ఇవ్వాలని సీఎం కె.చంద్రశేఖరరావు దృష్టికి తీసుకెళ్తానని ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఎమ్మార్పీఎస్(టీఎస్) ఆధ్వర్యంలో మంగళవారం హన్మకొండలో బహిరంగ సభ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై శ్రీహరి మాట్లాడారు..
- హన్మకొండ చౌరస్తా
హన్మకొండ చౌరస్తా : ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని, టీడీపీ హయూంలో తాను వర్గీకరణ కోసమే మంత్రి పదవిని వదులుకున్నానని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. తన పిల్లలకు వరంగల్ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించడం లేదని, ఇది మాదిగలకు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను కోరుతానని స్పష్టంచేశారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా సమితి(టీఎస్) ఆధ్వర్యంలో హన్మకొండలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. త్వరలోనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి వర్గీకరణ సాధనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేశాక కొందరు దిక్కుతోచని స్థితిలో మందకృష్ణ పడిపోయూరని ఎద్దేవా చేశారు. మందకృష్ణ ఒంటరిగా మిగిలాడన్నారు. దళితులకు భూ పంపిణీ కోసం అర్హుల జాబితా సిద్ధమవుతోందని తెలిపారు. దళితులు తమ పిల్లలకు చదువు అందించాలని కోరారు.
త్యాగాలు చేసే ఘనత మాదిగలదే: రాజయ్య
రైతాంగ సాయుధ పోరు, 1969 తెలంగాణ, నేటి మలిదశ ఉద్యమాల్లో ముందుండి పోరాడింది, త్యాగాలు చేసింది మాదిగలేనని, తాను మాదిగగా పుట్టినందుకు గర్విస్తున్నానని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య పేర్కొన్నారు. మాదిగ కళాకారులు లేనిది టీఆర్‌ఎస్ మీటింగ్ లేదన్నారు. డబ్బు ఆశ చూపించినా కాంగ్రెస్ పార్టీని, పదవిని వదిలి ఉద్యమంలోకి వచ్చానని చెప్పారు. రిజర్వేషన్లు ఉపయోగించుకుని దళితులంతా చదవాలని ఆకాం క్షించారు.
ఆ ఘనత ఎమ్మార్పీఎస్‌దే: ఎమ్మెలే అరూరి
వర్గీకరణ కోసం అందరిని ఏకతాటికి పైకి తెచ్చిన ఘనత ఎమ్మార్పీఎస్‌దేనని ఎమ్మెల్యే అరూరి రమేష్ పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేందుకు కేసీఆర్ పట్టుదలతో ఉన్నారని, ఇందుకు అందరూ సహకరించాలని కోరారు. ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ వంగపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, మందకృష్ణది చంద్రబాబుతో చీకటి ఒప్పందమని ఆరోపించారు. మాదిగల పైనే దాడి చేయించిన ఘనత మందకృష్ణదని విమర్శించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎమ్మార్పీఎస్ గౌరవాధ్యక్షుడు సండ్రపల్లి వెంకటయ్య, జిల్లా అధ్యక్షుడు సిలువేరు సాంబయ్య, డాక్టర్ రాజమౌళి, చింతల యాదగిరి, మేడి పాపయ్య, చింతల మల్లికార్జున్, కన్నం సునీల్, అర్శం అశోక్, గడ్డం సమ్మయ్య, పత్రి వెంకటయ్య, జీవీదాస్, చాట్ల నరేష్, తూర్పాటి సారయ్య, లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు. సభలో కళాకారులు గిద్దె రాంనర్సయ్య, వేపూరి సోమన్న, దారా దేవేందర్ ఆటాపాటా ఆకట్టుకుంది. సభకు వర్షం కాస్త ఆటంకం కలిగించింది.