
ఇక్కడ నీళ్లు...అక్కడ నిర్వహణ
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఎడమకాల్వ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా... సాగు, తాగు నీరు విడుదల చేయాలంటే... ఆంధ్రప్రదేశ్ పరిధిలోని లింగంగుంట్ల సర్కిల్ నీటిపారుదల అధికారులు ఆదేశాలు జారీ చేస్తేనే...మాచర్ల సబ్‌డివిజన్ నుంచి సిబ్బంది వచ్చి గేట్లు ఎత్తాల్సి ఉంటుంది. దీనికంతటికీ క్యాంప్స్‌అండ్ బిల్డింగ్, గేట్స్, నీటిసరఫరా సబ్‌డివిజన్లను గుంటూరు జిల్లా పరిధిలోని లింగంగుంట్ల సర్కిల్‌కు అటాచ్ చేయడమే కారణం. ఆయా డివిజన్ల పరిధిలో పనిచేస్తున్న 86మంది ఉద్యోగులను ఎన్‌ఎస్‌పీ సీఈ మాచర్ల సబ్‌డివిజన్‌లోకి బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది జరిగి మూడు నెలలు అవుతోంది. నాటి నుంచి ఉద్యోగులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. తెలంగాణ రాష్ర్ట పరిధిలోనే ఉంటామంటూ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావును కూడా కలిశారు.
ఆయన ఇరిగేషన్ కార్యదర్శి నాగిరెడ్డిని సమస్య పరిష్కరించమని ఆదేశించారు. నాటి నుంచి ఉద్యోగులు రెండు రాష్ట్రాల కార్యదర్శుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. డ్యాం నిర్మాణ సమయం నుంచి తెలంగాణ ప్రాంతంలోనే ఉంటున్నామని, ఇక్కడే జీతాలు తీసుకుంటున్నామని ఉద్యోగులు మొర పెట్టుకోవడంతో జీతాలు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. కృష్ణారివర్‌బోర్డు ఏర్పడేంతవరకు డ్యాంనిర్వహణతో పాటు గేట్లనిర్వహణ కార్యాలయాలు ఇక్కడే ఉండేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇంతలోనే లింగంగుంట్ల సర్కిల్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఏమిటని, ఉద్యోగులు, సాగర్ ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.