
రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, కుందూరు రఘువీర్‌రెడ్డి, ఎలిమినేటి సందీప్, పాల్వాయి స్రవంతి
సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లా ఓటర్లు ఇప్పటి దాకా వారసులకు జై కొట్టనే లేదు. ఆయా నియోజకవర్గాల నుంచి పలువురు సీనియర్ నేతలు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ప్రాతినిధ్యం వహించినా, వారి వారసులకు మాత్రం ఎలాంటి అవకాశాలు రాలేదు. కొందరు నేతల తనయులు ఎన్నికల బరిలోకి దిగాలని ప్రయత్నించినా, కనీసం పోటీ చేసే అవకాశం దక్కలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పన్నెండు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి దాకా ఎమ్మెల్యేలుగా పనిచేసిన నేతల తనయులకు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం కేవలం ఇద్దరికి మాత్రమే దక్కింది. వారు కూడా కేవలం ఒకే ఒక్క గెలుపునకు పరిమితమై పోయారు.
మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి 1962, 1967, 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన వరుస విజయాలు సాధించిన తిప్పన చిన కృష్ణారెడ్డి తనయుడు తిప్పన విజయ సింహారెడ్డి 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఒకే ఒకసారి విజయం సాధించారు. ఆ తర్వాత 1994 ఎన్నికల్లో ఆయనకు పోటీ చేసే అవకాశం దక్కినా గెలవలేక పోయారు. ఇదే తరహాలో మునుగోడు నియోజకవర్గం నుంచి సీపీఐ తరఫున ఉజ్జిని నారాయణరావు 1985, 1989, 1994 ఎన్నికల్లో వరసగా విజయాలు సాధించారు. ఆయన తనయుడు ఉజ్జిని యాదగిరిరావు 2009 ఎన్నికల్లో మునుగోడు నుంచి గెలిచారు. ఆ మరుసటి ఎన్నికల్లో ఆయన రెండోసారి పోటీ చేసే అవకాశమే దక్కలేదు. ఉమ్మడి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో ఇక, ఏ నేత తనయుడు కానీ, కూతురు కానీ తండ్రుల రాజకీయ వారసత్వాన్ని అందుకుని చట్టసభలకు వెళ్లలేక పోయారు.
అవకాశాలు దక్కని వారసులు:
జిల్లాలో సీనియర్ నేతల వారసులు కొందరు ఎన్నికల్లో పోటీ చేయాలని ఉత్సాహపడిన వారే. కానీ వారికి పోటీ చేసే అవకాశమే దక్కలేదు. కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి రెండు పర్యాయాలుగా ఎన్నికల బరిలోకి దిగాలని ప్రయత్నించారు. ప్రధానంగా ఈసారి మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీకి దిగాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరి నిమిషం దాకా ఢిల్లీలో ఏఐసీసీ నేతల వద్ద పావులు కదిపారు. కుటుంబానికి ఒకటే టికెట్ అన్న నిబంధన నేపథ్యంలో ఆయనకు టికెట్ దక్కలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2014 ఎన్నికల్లో టికెట్ ఆశించిన రఘువీర్ రెడ్డి అప్పుడు దక్కక పోవడంతో ఆశగా దాదాపు ఐదేళ్లు ఎదురు చూశారు. చివరకు ఆయనకు 2018 ఎన్నికలు సైతం చేదు జ్ఞాపకాన్ని మిగిల్చాయి. మిర్యాలగూడ నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచి ఎమ్మెల్యే అయిన ఎన్.భాస్కర్‌రావు, టీఆర్‌ఎస్‌లో చేరడం, ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగడం జరిగిపోయాయి. దీంతో ఈ సారి ఇక్కడినుంచి టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు.
మరో సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తమ్‌రెడ్డి గత ఎన్నికల సమయంలోనే భువనగిరి టికెట్ ఆశించారు. చివరి నిమిషం దాకా ప్రయత్నించి విఫలమయ్యారు. ఈసారి కూడా సూర్యాపేట నుంచి దామోదర్ రెడ్డికే టికెట్ లభించింది. దీంతో సర్వోత్తమ్ ఎన్నికల అరంగేట్రం వాయిదా పడిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరోమాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి తనయుడు సందీప్‌రెడ్డి రాజకీయ అరంగేట్రం చేసినా, ఎన్నికల గోదాలోకి దిగే అవకాశమే దక్కలేదు. జిల్లాల విభజన జరిగాక ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి టీడీపీని వీడి టీఆర్‌ఎస్ గూటికి చేరడంతో ఆయన తన తల్లి వెంటే గులాబీ కండువా కప్పుకున్నారు. వాస్తవానికి భువనగిరి నుంచి మాధవరెడ్డి నాలుగు పర్యాయాలు, ఉమా మాధవరెడ్డి మూడు సార్లు మొత్తంగా ఎలిమినేటి కుటుంబం ఏడు సార్లు ప్రాతినిధ్యం వహించింది.
1985 నుంచి 2009 వరకు ఈ నియోజకవర్గం ఈ కుటుంబం చేతిలోనే ఉండింది. 2014లో మాత్రమే ఇక్కడినుంచి టీఆర్‌ఎస్ విజయం సాధించింది. ఇంత పట్టున్న నియోజకవర్గం నుంచి ఎలిమినేటి వారసుడికి మాత్రం అవకాశం దక్కలేదు. మునుగోడు నియోజకవర్గంపై ప్రత్యేక ముద్ర వేసిన కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి దామోదర్ రెడ్డి కుటుంబం నుంచి కూడా ఎవరూ చట్ట సభలకు వెళ్లలేక పోయారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుటుంబం నుంచి ఆయన తనయుడు, కూతురు రాజకీయాల్లో ఉన్నా.. ఎన్నికలకు మాత్రం వారికి కలిసిరాలేదు. గోవర్ధన్‌రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించారు. గత ఎన్నికల్లో టికెట్ దక్కక పోవడంతో ఆమె రెబల్‌గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఈసారి కూడా చివరి నిమిషం దాకా టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఇక, గోవర్ధన్‌రెడ్డి తనయుడు పాల్వాయి శ్రవణ్ రెడ్డి ఈ సారి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇలా, జిల్లా వ్యాప్తంగా పలువురు సీనియర్ నేతలు ఎవరూ ఎన్నికల రంగంపై లేకుండా అయ్యారు.