నయీమ్ కేసు దర్యాప్తునకు సిట్ | nayeem case enquiry gives to SIT by telangana government | Sakshi
Sakshi News home page

నయీమ్ కేసు దర్యాప్తునకు సిట్

Published Wed, Aug 10 2016 2:34 AM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM

నయీమ్ కేసు దర్యాప్తునకు సిట్ - Sakshi

నయీమ్ కేసు దర్యాప్తునకు సిట్

నేడు అధికారికంగా ప్రకటించనున్న డీజీపీ అనురాగ్‌శర్మ
సాక్షి, హైదరాబాద్: మాజీ మావోయిస్టు, గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీ మ్ ఎన్‌కౌంటర్ తదనంతరం జరుగుతున్న విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. నయీమ్, అతని అనుచరుల నివాసాల్లో జరుగుతున్న సోదాల్లో రూ.కోట్ల విలువ చేసే ఆస్తులు, బంగారు నగలు, వజ్రాలు బయటపడుతున్నాయి. లెక్కకు మించి ఇళ్లు, ఇళ్ల స్థలాలు, వందలాది ఎకరాల భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో విచారణను పకడ్బందీగా చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఐజీ (పర్సనల్) సందీప్ శాండిల్య నేతృత్వంలో ఈ సిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. సిట్ నియామకాన్ని డీజీపీ అనురాగ్‌శర్మ బుధవారం అధికారికంగా ప్రకటించే అవకాశముంది. శాంతి భద్రతల విభాగానికి చెందిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నా.. అంతర్గతంగా వివిధ కోణాల్లో సవాళ్లు ఎదురవుతున్నాయి. దీంతో సిట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా దర్యాప్తు వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
 
నయీమ్ ఆస్తుల స్వాధీనానికి జీవో!

విలువ రూ.2,500 కోట్ల దాకా ఉంటుందని అంచనా
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ అక్రమాస్తులను స్వాధీనం చేసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రాథమిక అంచనాల మేరకు నయీం కూడబెట్టిన ఆస్తి రమారమి రూ.2,500 కోట్ల దాకా ఉంటుందని అంచనా. పోలీసు శాఖ నియమించే సిట్ విచారణ అనంతరం ఆస్తులకు సంబంధించి స్పష్టత వస్తుందని ఆ వర్గాలు వెల్లడించాయి. నయీమ్ వివిధ ప్రాంతాల్లో కూడబెట్టిన ఆస్తులతో జాబితారూపొందించి వాటి వివరాల ఆధారంగా ప్రభుత్వం జీవో జారీ చేస్తుంది. ఆ జీవో ద్వారా కోర్టు అనుమతితో ఆస్తులను స్వాధీనం చేసుకుంటుంది.  
 
నయీమ్ సోదరి ఇంట్లో సోదాలు

కోహీర్: మెదక్ జిల్లా కోహీర్‌లోని ఘడీ ప్రాంతంలో నయీమ్ సోదరి అయేషా బేగం ఇంట్లో పోలీసులు సోదాలు జరిపారు. ఆమె పేరిట ఉన్న రూ.80 లక్షల విలువ చేసే ప్లాట్లకు సంబంధించిన పత్రాలు, సుమారు 30 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement