సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ పసిప్రాణాన్ని బలి తీసుకుంది. పదుల సంఖ్యలో నవజాత శిశువులను తీవ్ర అస్వస్థతకు గురి చేసింది. మరో 24 గంటలు గడిస్తే కానీ వారి పరిస్థితి ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. టీకాలు వేశాక ఒక మందుకు బదులు మరో మందు ఇవ్వడమే పిల్లల ప్రాణాల మీదకు తెచ్చిందని తేలింది.
ఎలా జరిగింది?
జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా బుధవారం నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో శిశువులకు వాక్సినేషన్ వేశారు. ఒకటిన్నర నెలల నుంచి మూడున్నర నెలలలోపు ఉన్న 92 మంది శిశువులకు పెంటావాలంట్ వాక్సిన్ ఇచ్చారు. సాధారణంగా టీకాలు వేశాక శిశువులకు జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో వాక్సినేషన్‌లో పాల్గొన్న సిబ్బంది జ్వరాన్ని తగ్గించేందుకు ‘పారాసిటమాల్’టాబ్లెట్ ఇవ్వాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా నొప్పుల నివారణకు వాడే ‘ట్రెమడాల్’(300 ఎంజీ) పెయిన్‌కిల్లర్ టాబ్లెట్‌ను ఇచ్చారు. సాధారణంగా ఈ మాత్రలను పిల్లలకు రికమెండ్ చేయరు. ఆస్పత్రి వైద్య సిబ్బంది వాటిని పరిశీలించకుండానే పంపిణీ చేయడంతో ఇది తెలియని తల్లిదండ్రులు ఆ మాత్రలను పిల్లలకు వేశారు. దీంతో టాబ్లెట్ వేసిన కొద్దిసేపటికే అవి వికటించి పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డోస్ ఎక్కువై..ఊపిరాడక, అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. దీంతో బుధవారం సాయంత్రం చికిత్స కోసం చిన్నారులను నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో కిషన్‌బాగ్‌కు చెందిన రెండున్నర నెలల ఫైజాన్ అనే బాలుడు మార్గమధ్యలోనే మృతిచెందగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడు తూ అపస్మారక స్థితిలో ఆస్పత్రికి చేరుకున్న మ రో ముగ్గురు (సయ్యద్ ముస్తఫా, హీనా బేగం, అబూఅజ్మల్)శిశువులను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరో 24 గంట లు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు. గురువారం మధ్యాహ్నం వరకు 22 మంది చిన్నారులను నిలోఫర్‌కు తరలించగా సాయంత్రానికి ఈ బాధితుల సంఖ్య 27కు చేరుకుంది.
కళ్లు మూసుకుని మందులు పంచారు..
నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో వాక్సినేషన్‌తోపాటు ప్రసవాలు, ఆర్థోపెడిక్ వంటి స్పెషాలిటీ సేవలు కూడా అందిస్తున్నారు. సర్జరీల తర్వాత నొప్పిని నివారించేందుకు ఆ టాబ్లెట్లను వాడుతుంటారు. వీటిని పెద్దలకే ఇస్తారు. ఫార్మసీ సిబ్బంది ఓపీ సేవలకు ముందే తమ వద్దకు వచ్చిన మెడికల్ స్ట్రిప్‌లను (రెండు టాబ్లెట్ల చొప్పున) ఐదు భాగాలుగా కట్ చేసుకొని బాక్సుల్లో పెట్టుకుంటారు. మందులు నిల్వ చేసిన బాక్సులు సహా ఆ రెండు టాబ్లెట్ల కవర్లు చూడ్డానికి ఒకేలా ఉండటం, సిబ్బంది వాటిపై ముద్రించిన పేర్లు కూడా చూడకుండానే పంచడం, విషయం తెలియక తల్లిదండ్రులూ వేయడం చిన్నారుల అస్వస్థతకు కారణమైంది. ఫార్మసిస్ట్‌లే మందులు ఇవ్వాల్సి ఉండగా నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో ఏఎన్‌ఎంలతో పంపిణీ చేయించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఎన్‌ఎంలుగా పని చేస్తున్న వారిలో చాలా మందికి చికిత్సలపై అవగాహన లేకపోవడమే ఇలాంటి ఘటనలకు కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతేడాది రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
త్వరలోనే కోలుకుంటారు..
చిన్నారులంతా త్వరలోనే కోలుకుంటారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్
అయ్యో.. బంగారుకొండ
Published Fri, Mar 8 2019 1:41 AM | Last Updated on Fri, Mar 8 2019 1:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment