కలెక్టరేట్ : నేరుగా జిల్లా కలెక్టర్‌ను కలిసి సమస్యను విన్నవిస్తే సత్వర పరిష్కారం లభిస్తుందనేది ప్రజల ఆశ. అందుకు ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజాఫిర్యాదుల విభాగం(గ్రీవెన్స్) వేదికవుతోంది.మండలాల్లో అధికారులు ఉన్నా సమస్యను నేరుగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం లభిస్తుందని ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి జిల్లా నలుమూలల నుంచి ఆదిలాబాద్‌కు తరలి వస్తుంటారు. అన్ని శాఖల అధికారులు ఒకే చోట ఉండడం వల్ల పరిష్కారానికి మార్గం సులువు అవుతుంది.
ఈ కార్యక్రమాన్ని కలెక్టర్లు తమదైన శైలీలో నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు కలెక్టర్లు సైతం ఈ ప్రక్రియ కొనసాగింపునకు ఆసక్తి చూపుతున్నారు. గత ఐదేళ్లలో ఫిర్యాదుల విభాగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.
అహ్మద్ నదీం.. డివిజన్ కేంద్రాల్లోకి..
2007 జూన్ నుంచి 2010 ఏప్రిల్ వరకు కలెక్టర్‌గా పనిచేసిన అహ్మద్ నదీం అప్పట్లో ప్రతీ డివిజన్ కేంద్రంలో ప్రజాఫిర్యాదుల విభాగం నిర్వహించారు. ఒక్కో సోమవారం ఒక్కో డివిజన్ కేంద్రానికి వెళ్లి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వీలైన వాటికి అక్కడికక్కడే పరిష్కారం చూపేవారు. అర్జీల స్వీకరణలో వృద్ధులు, వికలాంగులకు ప్రాధాన్యం ఇచ్చేవారు. అర్జీలపై సమీక్షించి అధికారులు శ్రద్ధ వహించే విధంగా చూడడంతో ప్రజలకు కొంతమేర సత్ఫలితాలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన బదిలీ అయ్యారు.
వెంకటేశ్వర్లు.. నేనున్నాను మీ కలెక్టర్
2010 ఏప్రిల్ నుంచి 2011 ఏప్రిల్ వరకు కలెక్టర్‌గా ఉన్న పి.వెంకటేశ్వర్లు ప్రజల సమస్యలపై ప్రత్యేక చొరవ చూపారు. సమస్యలు విన్నవించేందుకు దూర ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా మండల కేంద్రాల్లో ‘నేనున్నాను మీ కలెక్టర్’ అనే పెట్టెలను ఏర్పాటు చేయించారు. జిల్లా కేంద్రానికి రాకుండా నేరుగా ఆ పెట్టెలో తమ సమస్యకు సంబంధించిన అర్జీని వేసే సౌకర్యం కల్పించారు. మండలం నుంచి అవి నేరుగా రెవెన్యూ అధికారుల ద్వారా కలెక్టర్‌కు చేరేవి. ఈ క్రమంలో ఆయన బదిలీపై వెళ్లారు.
అశోక్.. అర్జీలకు రశీదు
2011 ఏప్రిల్ నుంచి 2013 జూన్ వరకు కలెక్టర్‌గా ఉన్న డాక్టర్ అశోక్ రాత్రి వరకూ అర్జీలు స్వీకరించేవారు. మండల, డివిజన్, జిల్లా స్థాయిలో కూడా స్వీకరించారు. ప్రతీ సోమవారం డివిజన్ కేంద్రాలకు వెళ్లి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేవారు. అర్జీ సమర్పించిన వారికి రశీదు అందజేయడం ఆయన హయాంలోనే మొదలైంది. అధికారుల అలసత్వం, వచ్చిన అర్జీలను కింది స్థాయి అధికారులకు అప్పగించడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా పోయాయి. ఫలితంగా మళ్లీ మళ్లీ అర్జీలు సమర్పించాల్సి వచ్చేది.
గాడిలో పెట్టిన కలెక్టర్ అహ్మద్ బాబు
2013 జూన్ నుంచి 2014 జూన్ వరకు కలెక్టర్‌గా కొనసాగిన అహ్మద్ బాబు ప్రజాఫిర్యాదుల విభాగాన్ని గాడిలో పెట్టారు. ప్రజల సమస్యలపై వెనువెంటనే స్పందించి పరిష్కారం చూపేవారు. దీంతో అర్జీల తాకిడి ఎక్కువైంది. ప్రతీ సమస్యకు పరిష్కార మార్గం చూపే విధంగా ఆన్‌లైన్ ద్వారా అర్జీలు స్వీకరించే విధానాన్ని ప్రవేశపెట్టారు. 2014 జనవరి నుంచి గ్రీవెన్స్ మేనేజ్‌మెంటు సిస్టం(జీఎంఎస్) అమలు చేశారు.
ఆన్‌లైన్‌లో అర్జీదారుల సమస్యలను నమోదు పరిష్కారమార్గం చూపడంతో ప్రజల నుంచి స్పందన లభించింది. ప్రతీ వారం సుమారు 600 వరకు అర్జీలు అందేవి. ఆన్‌లైన్ విధానం ద్వారా ఆరు నెలల్లోనే పది వేల అర్జీలు నమోదయ్యాయి. ఈ విధానాన్నే కొనసాగిస్తే మేలు జరుగుతుందని అర్జీదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మార్పులు ఉంటాయా..?
ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజాఫిర్యాదుల విభాగంలో కొత్త కలెక్టర్ జగన్‌మోహన్ మార్పులు చేస్తారా..? పాత విధానాన్నే కొనసాగిస్తారా..? అనే సందేహం అధికారుల్లో వ్యక్తమవుతోంది. గతంలో కలెక్టర్లు మారినప్పుడల్లా గ్రీవెన్స్‌లో మార్పులు తీసుకురావడం పరిపాటిగా మారింది. ప్రస్తుత విధానంపై బాధితుల్లో మంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది.
‘గ్రీవెన్స్’పై ఒక్కొక్కరిది ఒక్కో విధానం
Published Tue, Jul 8 2014 12:21 AM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM
Advertisement
Advertisement