ఆ‘సారా’ ఉండదు..! | Asara 'is not ..! | Sakshi
Sakshi News home page

ఆ‘సారా’ ఉండదు..!

Published Sat, Feb 7 2015 1:33 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

ఆ‘సారా’ ఉండదు..! - Sakshi

ఆ‘సారా’ ఉండదు..!

  • గుడుంబా స్థానంలో సారాయి ప్రవేశపెడితే అసలుకే మోసమంటున్న ఆర్థిక శాఖ
  • ఐఎంఎల్, బీర్ల విక్రయాలపై ఆదాయ లక్ష్యం రూ. 10,500 కోట్లు
  • ఇందులో 40 శాతం వాటా చీప్‌లిక్కర్‌దే.. సారాతో చీప్‌లిక్కర్ ఔట్
  • లాభనష్టాలను బేరీజు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
  • మహారాష్ట్రలో దేశీదారు అమ్మకాలను పరిశీలించి వచ్చిన ఎక్సైజ్ బృందం
  • సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గుడుంబాకు అడ్డుకట్ట వేసేందుకు సర్కారీ సారాయిని ప్రవేశపెట్టాలని భావిస్తున్న ప్రభుత్వం... దానివల్ల ఎక్సైజ్ రెవెన్యూ తగ్గిపోతుందేమోనని తర్జనభర్జన పడుతోంది. ఐఎంఎల్ (స్వదేశీ తయారీ మద్యం), బీర్ల అమ్మకాల ద్వారా ఏటా రూ. 10 వేల కోట్ల ఆదాయం సమకూరుతుండగా... చీప్‌లిక్కర్ కన్నా తక్కువ ధరకు సారాయి విక్రయిస్తే అసలుకే మోసం వస్తుందేమోనని భావిస్తోంది.

    1993లో సారాయిపై ప్రభుత్వం నిషేధం విధించేనాటికి ఐఎంఎల్‌పై వచ్చే ఆదాయం కన్నా.... సారాయి కాంట్రాక్టులు, అమ్మకాల ద్వారానే అబ్కారీ శాఖకు ఎక్కువగా ఆదాయం వచ్చేంది. సారాపై నిషేధంతో చీప్‌లిక్కర్ ఆ స్థానాన్ని భర్తీ చేయడం, ప్రజల ఆర్థిక స్థితిగతుల్లో వచ్చిన మార్పులు వంటివాటితో ఐఎంఎల్, బీర్ల అమ్మకాలు పెరిగి ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఇదే సమయంలో కార్మికులు, అల్పాదాయ వర్గాలు తక్కువ ధరలో లభించే ప్రమాదకరమైన నాటుసారా తాగుతుండడంతో అనర్థాలు పెరిగాయి.

    ఇటీవల సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో మహిళలు గుడుంబాపై ఆందోళన వ్యక్తం చేశారు కూడా. ఈ నేపథ్యంలో గుడుంబాకు పరిష్కారంగా ప్రభుత్వ సారాయిని ప్రవేశపెట్టాలని ప్రభుత్వ పెద్దలు అభిప్రాయానికి వచ్చారు. ఈ మేరకు ఎక్సైజ్ మంత్రి, సంబంధిత అధికారులతో సీఎం సమావేశమై... సారాయిని ప్రవేశపెడితే ఎదురయ్యే పరిణామాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

    అయితే సారాను ప్రవేశపెడితే ఎక్సైజ్ శాఖ ద్వారా వస్తున్న రెవెన్యూలో లోటు తప్పదని ఆర్థిక శాఖ తేల్చినట్లు సమాచారం. ప్రస్తుతం మండల కేంద్రాలు, హైవేలకు మాత్రమే వైన్‌షాపులు, బార్లు పరిమితం. సారాయి ప్రవేశపెడితే ఊరూరా దుకాణం ఏర్పాటవుతుందని, అదే జరిగితే చీప్‌లిక్కర్, మీడియం లిక్కర్ తాగేవారు సారా వైపు మొగ్గు చూపుతారేమోనని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. ఇదే జరిగితే ఖజానా రాబడి భారీగా తగ్గిపోతుందని  ఎక్సైజ్ శాఖ నివేదిక రూపొందించింది.
     
    మహారాష్ట్రలో పరిశీలన

    మహారాష్ట్రలో చౌకమద్యంగా ‘దేశీదారు’కు డిమాండ్ ఉండడంతో... ఎక్సైజ్ కమిషనర్ అహ్మద్ నదీం ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ రాజశేఖర్‌తో కూడిన బృందం ఆ రాష్ట్రానికి వెళ్లి పరిశీలించింది. అక్కడి ప్రభుత్వం 90 ఎంఎల్ దేశీదారు మద్యాన్ని రూ. 17కే సరఫరా చేస్తుండడంతో అల్పాదాయ వర్గాలు, కార్మిక వర్గాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. అయితే మహారాష్ట్రలో దేశీదారు అమ్మకాలు, ఆదాయం, దేశీదారు వల్ల ఐఎంఎల్ అమ్మకాలకు జరిగే నష్టం తదితర అంశాలను రాష్ట్ర ఎక్సైజ్ బృందం పరిశీలించింది. రాష్ట్రంలో సారాయిని ప్రవేశపెడితే ఒక్కో మండలంలో ఎన్ని దుకాణాలకు అనుమతులు ఇవ్వాలి, లెసైన్స్ ఫీజు, సారాయి ధర ఎంత ఉండాలనే వివరాలతో నివేదికను ఎక్సైజ్ కమిషనర్‌కు ఇచ్చింది. అలాగే, సారాయిని 90 ఎంఎల్‌కు బదులు 180 ఎంఎల్ బాటిల్‌గా రూ. 35 కనీస ధరగా ఉండాలని కూడా తెలిపినట్లు సమాచారం.
     
    ఆదాయం ఔట్?

    రాష్ట్రంలో జనవరి నెలలో 17.90 లక్షల కేసుల ఐఎంఎల్ మద్యం, 25 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. తద్వారా వచ్చిన రెవెన్యూ రూ.767 కోట్లు. ఈ మొత్తం ఆదాయంలో చీప్ లిక్కర్ అమ్మకాల ద్వారా వచ్చేది 40 శాతానికిపైగా ఉంటుంది. అదే సారాయిని ప్రవేశపెడితే చీప్‌లిక్కర్ అమ్మకాలు తగ్గిపోయే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం రూ. 10,500 కోట్ల ఆదాయ లక్ష్యంగా సాగుతున్న ఎక్సైజ్ రెవెన్యూలో సారాయి వల్ల భారీగానే కోత పడుతుందని ఎక్సైజ్, ఆర్థికశాఖలు ప్రాథమికంగా తేల్చాయి. అయితే సారాయి వల్ల రాష్ట్రవ్యాప్తంగా రూ. 2,500 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని తేల్చినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం మద్యం దుకాణాలు, బార్లు ఏర్పాటు చేసేందుకు లెసైన్స్ ఫీజు రూ. 35 లక్షల నుంచి రూ. 90 లక్షల వరకు ఉంది. ఈ ఫీజు రూపంలోనే ఏటా వెయ్యి కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement