పీహెచ్‌డీ
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల్లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీలో (పీహెచ్‌డీ) ప్రవేశాలకు కొత్త నిబంధనలు రాబోతున్నాయి. ఉన్నత విద్యామండలి నియమించిన వైస్ చాన్స్‌లర్ల కమిటీ నిబంధనల రూపకల్పనపై కసరత్తు చేస్తోంది. వర్సిటీలు ఇష్టానుసారం ప్రవేశాలు చేపట్టడానికి వీల్లేకుండా కమిటీ నివేదికను సిద్ధం చేస్తోంది. త్వరలోనే నివేదికను ఉన్నత విద్యామండలికి అందజేయనుంది. ప్రాథమిక నిర్ణయం మేరకు నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఏ+, ఏ గుర్తింపు కలిగిన యూనివర్సిటీలే ఇకపై పీహెచ్‌డీ ప్రవేశాలకు పరీక్షలను నిర్వహించనున్నాయి. విద్యార్థులు నిర్ణీత అర్హతలతోపాటు ప్రవేశ పరీక్షలో అర్హత సాధిస్తే పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పించనున్నాయి.
అయితే రాష్ట్రంలో ఉస్మానియా, కాకతీయ, జేఎన్‌టీయూ వంటి కొన్ని యూనివర్సిటీలకే న్యాక్ ఏ గ్రేడ్ గుర్తింపు ఉంది. న్యాక్ ఏ గ్రేడ్ గుర్తింపు లేని వర్సిటీలు ఇకపై పీహెచ్‌డీలో ప్రవేశాలకు సొంతంగా ప్రవేశ పరీక్ష నిర్వహించడానికి వీల్లేకుండా నిబంధనలను రూపొందిస్తోంది. ఆయా వర్సిటీలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) జారీ చేసిన పీహెచ్‌డీ ప్రవేశాల నిబంధనల ప్రకారమే పీహెచ్‌డీల్లో ప్రవేశాలు చేపట్టేలా కసరత్తు చేస్తోంది. విద్యార్థులకు నెట్/స్లెట్/సెట్/జే ఆర్‌ఎఫ్/ఐసీఎస్‌ఎస్‌ఆర్ వంటి అర్హతల ఆధారంగా పీహెచ్‌డీల్లో ప్రవేశాలు చేపట్టేలా నిబంధనలను సిద్ధం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment