మహబూబాబాద్ ఘటన నేపథ్యంలో భేటీ
సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనా పట్ల ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచితంగా ప్రవర్తించిన నేపథ్యంలో ఐఏఎస్ అధికారుల సంఘం గురు వారం మంజీరా అథితిగృహంలో ప్రత్యేకంగా సమావేశమైంది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సుమారు 35 మంది ఐఏఎస్ అధికారులు పాల్గొనగా.. దాదాపు ఏడు గంటలపాటు సుదీర్ఘంగా చర్చిం చారు. మహబుబాబాద్ కలెక్టర్ పట్ల ఎమ్మెల్యే తీరును తీవ్రంగా తప్పుబట్టారు.
ఈ ఘటనపై తక్షణమే స్పందించినందుకు సీఎంకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన విచారణను వేగవంతం చేయాలని, అలాగే దర్యాప్తు పక్రియ పారదర్శకంగా చేపట్టాలని పోలీసులను కోరారు. సమావేశంలో కేవలం మహబుబాబాద్ ఘటనే కాకుండా పలు అంశాలు చర్చకు వచ్చాయి. జిల్లాస్థాయిలో కొందరు రాజకీయ నాయకులతో ఎదురవుతున్న సమస్యలు, ఇబ్బందులపైనా చర్చించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక కార్యచరణ రూపొందించాలని నిర్ణయించారు. ఐఏఎస్ అధికారుల సంఘం శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ను కలవనుంది.