ఎమ్మెల్యే నాయక్ అరెస్టు, బెయిలు
విచారణాధికారిగా తొర్రూరు డీఎస్పీ
► కలెక్టర్ తదితరుల వాంగ్మూలం నమోదు
► ఎమ్మెల్యే తీరుపై జిల్లాలో విపక్షాల ఆందోళన
సాక్షి, మహబూబాబాద్: జిల్లా కలెక్టర్ ప్రీతీ మీనాతో అనుచితంగా ప్రవర్తించిన మహబూబాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఉదయం ఆయన కేసముద్రం మండలంలో హరితహారంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మహబూబాబాద్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో హాజరయ్యారు. అరెస్టు అనంతరం ఆయన్ను స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.
ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు అడ్డుకోవచ్చనే అంచనాతో భారీ బందోబస్తు కల్పించారు. అంతకుముందు బుధవారం అర్ధరాత్రి దాటాక ఎమ్మెల్యేపై పోలీసులు ఐపీసీ 353 (ప్రభుత్వాధికారుల విధులకు ఆటంకం కలిగించడం), 354 (మహిళలతో ఉద్దేశపూర్వకంగా దురుసుగా ప్రవర్తించడం), 509 (బహిరంగ ప్రదేశంలో మహిళ అని కూడా చూడకుండా అవమానపరచడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తొర్రూరు డీఎస్పీ బి.రాజారత్నంను విచారణాధికారిగా జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి నియమించారు. సంఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందా, యాదృచ్ఛికంగానా అన్నదానిపై డీఎస్పీ విచారించి ఉన్నతాధికారులకు నివేదిస్తారు. దాని ఆధారంగా కేసులపై దర్యాప్తు ముందుకు సాగుతుంది.
విచారణ ప్రారంభం
ఘటనపై డీఎస్పీ విచారణ ప్రారంభించారు. కలెక్టర్ ప్రీతీ మీనా, జేసీ దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధుల వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. మరోవైపు కలెక్టర్ పట్ల ఎమ్మెల్యే అనుచిత ప్రవర్తనను నిరసిస్తూ ప్రతిపక్షాలు జిల్లావ్యాప్తంగా ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్)న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాస్తారోకోలు జరిపారు. ఆయన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.