
శుక్రవారం రాత్రి శాసనసభ వాయిదా పడిన అనంతరం తనకు ఎదురైన మీడియాతో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతున్న క్రమంలో.. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అటుగా వెళ్తూ కనిపించారు. ‘కాబోయే రైతు సమన్వయ సమితి చైర్మన్ గోవర్ధన్ అట కదా’అని ప్రశ్నించిన విలేకరులు.. పంచెకట్టుతో అసెంబ్లీకి వచ్చే ఆయన ఆహార్యం కూడా ఆ పదవికి సరిపోతుందని కామెంట్ చేశారు.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు పంచె కట్టుతో వస్తానని నిరంజన్‌రెడ్డి అన్నా రు. పంచె కట్టుతో వచ్చే ఎమ్మెల్యేలు ఎవరనే అంశంపైకి చర్చ మళ్లగా బాజిరెడ్డి గోవర్ధన్‌తోపాటు, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్లు ప్రస్తావనకు వచ్చాయి.గతంలో మాజీ ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య పంచె కట్టులో కనిపించిన విషయం ప్రస్తావనకు రాగా.. ఆయనకు పంచె కట్టు అచ్చి రాలేదు అని వ్యాఖ్యానించడంతో నవ్వులు విరిశాయి.