
నాణ్యత విషయంలో రాజీ వద్దు
‘ పనిలో నాణ్యత, ఉద్యోగిలో నిజాయితీ ఉండాలి, అధికారులు చట్టానికి భయపడాలి తప్ప వ్యక్తులకు కాదు’ అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
పని చేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టండి: మంత్రి హరీశ్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘ పనిలో నాణ్యత, ఉద్యోగిలో నిజాయితీ ఉండాలి, అధికారులు చట్టానికి భయపడాలి తప్ప వ్యక్తులకు కాదు’ అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నల్లవాగు, గట్టులింగపల్లి ప్రాజెక్టులను ఆయన ఏరియల్ సర్వే చేశారు. అనంతరం నియోజకవర్గం అభివృద్ధి పనులనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మిషన్ కాకతీయ ఫేజ్-1లో మిగిలిపోయిన చెరువు పనులతోపాటు ఫేజ్-2 చెరువుల్లో కూడా పూడికతీత పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పైపై పూతలతో పనులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పనులు చేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే అధికారులకు చార్జి మెమోలు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. తక్షణ తాగు నీటి అవసరాల కోసం గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులు వినియోగించుకోవాలని హరీశ్‌రావు సూచించారు.
మార్కెటింగ్ శాఖకు పెద్దపీట
జనగామ: తెలంగాణ ప్రభుత్వం మార్కెటింగ్ శాఖకు పెద్దపీట వేస్తోందని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా జనగామ వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన ప్యాడీ డ్రయర్, కవర్డు యాక్షన్ షెడ్డును మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో 150 మార్కెట్‌లు ఉండగా, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 32 కొత్తగా ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో మార్కెట్‌ల పరిధిలో గోదాంల నిర్మా ణం కోసం రూ.1,024 కోట్లు, కవర్డు షెడ్డులతో పాటు మౌలిక వసతుల కల్పనకు రూ.400 కోట్లు మంజూరు చేశామని వివరించారు. ప్యాడీ డ్రయర్ (ధాన్యం తేమ తగ్గించే యంత్రం) పంజాబ్ తర్వాత దేశంలో రెండవ యంత్రాన్ని జనగామలో ఏర్పాటు చేసినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు.