సారంగాపూర్ : జిల్లా సహకార మార్కెటింగ్ అధ్యక్షుడు, కౌట్ల(బి) పీఏసీఎస్ అధ్యక్షుడు అయిర నారాయణరెడ్డిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మంగళవారం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగాల్సి ఉండగా మెజార్టీ సభ్యులు సమావేశానికి గైర్హాజరయ్యారు. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు జిల్లా ఇన్‌చార్జి సహకార అధికారి, నిర్మల్ డీఎల్‌సీవో సూర్యచందర్‌రావు, డీసీవో సూపరింటెండెంట్ గుణవంత్‌రావు ప్రకటించారు. అయిర నారాయణరెడ్డిపై అవిశ్వాసం పెడుతూ జూలై 15న నోటీసులిచ్చారు.
అయితే ఆయన తన పదవిని కాపాడుకునేందుకు మెజారిటీ డెరైక్టర్లతో 29 రోజులపాటు క్యాంపు నిర్వహించారు. మంగళవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో అవిశ్వాసం ఓటింగ్ జరగాల్సి ఉండగా మెజారిటీ సభ్యులు అనగా 13 మందిలో ఒక్కరు కూడా హాజరు కాలేదు. దీంతో అవిశ్వాసం వీగిపోయినట్లు అధికారులు ప్రకటించారు.
సర్వత్రా ఉత్కంఠత
తొలుత డీసీఎంఎస్ పదవికి అవిశ్వాసం నోటీసు రావడంతో అయిర నారాయణ రెడ్డి వర్గీయుల్లో గుబులు పుట్టింది. అయితే నారాయణరెడ్డి హైకోర్టు నుంచి స్టే తీసుకురావడంతో అవిశ్వాసం వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఒక్కరోజు వ్యవధిలోనే కౌట్ల(బి) సహకార సంఘం అధ్యక్ష పదవికి పెట్టిన అవిశ్వాసం ప్రత్యేక సమావేశం నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన నేతలు ఎలాంటి వ్యూహప్రతివ్యూహాలు పన్నుతారోనని అన్ని వర్గాల ప్రజలతోపాటు స్థానిక నాయకుల్లో ఉత్కంఠత ఏర్పడింది.
మంగళవారం ఉదయం 11 గంటలకు సారంగాపూర్‌లోని పీఏసీఎస్ కార్యాలయంలో అవిశ్వాసంపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడంతో చివరి వరకు ఏం జరుగుతుందోనని డీసీఎంఎస్ అధ్యక్షుడు నారాయణరెడ్డితోపాటు మండల కాంగ్రెస్ నాయకుల్లోనూ ఉత్కంఠత రేగింది. మొత్తం 13 మంది డెరైక్టర్లలో ఏడుగురు డెరైక్టర్లు ప్రత్యేక సమావేశానికి హాజరై అధికార పార్టీకి మద్దతు తెలిపితే అధికార పార్టీకి కోరం దక్కినట్లే. అయితే ముందస్తుగా నారాయణరెడ్డి తన మద్దతు డెరైక్టర్లతో క్యాంపు నిర్వహించడంతో ఒక్కరు కూడా ప్రత్యేక సమావేశానికి హాజరు కాలేదు.
కాంగ్రెస్ నాయకుల సంబరాలు
అవిశ్వాసం వీగిన నేపథ్యంలో మండల కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. డీసీఎంఎస్ అధ్యక్షుడు నారాయణరెడ్డికి పూలమాలతో సత్కరించి స్వీట్లు పంచి పెట్టారు. అనంతరం రంగులు చల్లుకుంటూ బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. నారాయణరెడ్డి స్వగ్రామమైన కౌట్ల(బి)లో గ్రామ సర్పంచ్ మోహన్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తీగల మోహన్, నాయకులు వంగ లింగారెడ్డి, ఉట్ల రాజేశ్వర్, నర్సారెడ్డి, రాజేశ్వర్‌రావు, ఓలాత్రి నారాయణరెడ్డి, నక్కరాజన్న, రవీందర్, భోజారెడ్డి ఉన్నారు.
‘అయిరై’పె వీగిపోయిన అవిశ్వాసం
Published Wed, Aug 13 2014 1:08 AM | Last Updated on Wed, Oct 17 2018 6:22 PM
Advertisement
Advertisement