అవిశ్వాసం గట్టెక్కేనా..! | narayana reddy resign to DCMS chairman post | Sakshi
Sakshi News home page

అవిశ్వాసం గట్టెక్కేనా..!

Published Fri, Nov 28 2014 2:08 AM | Last Updated on Wed, Oct 17 2018 6:22 PM

narayana reddy resign to DCMS chairman post

ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లా మార్కెటింగ్ కో ఆపరేటివ్ సొసైటీలో అవిశ్వాస తీర్మానం మళ్లీ తెరపైకి వచ్చింది. శుక్రవారం అవిశ్వాస తీర్మానం ఉన్న నేపథ్యంలోనే గురువారం చైర్మన్ పదవికి నారాయణరెడ్డి రాజీనామా చేయడం ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. రాజీనామాను కమిషనర్‌కు సమర్పించకపోవడంతో ఆ రాజీనామా చెల్లుబాటు కాదని జిల్లా సహకార అధికారి (డీసీవో) సూర్యచందర్‌రావు స్పష్టం చేశారు. దీంతో నిర్ణయించిన సమయానికే అవిశ్వాస తీర్మానం జరుగుతుందని తెలిపారు. ఫలితంగా శుక్రవారం అవిశ్వాస తీర్మాన సమావేశం అనివార్యమైంది.

 టీఆర్‌ఎస్ ఖాతాలోకే..!
 డీసీఎంఎస్ అధ్యక్ష పదవిని టీఆర్‌ఎస్ చేజిక్కించుకునేందుకు నారాయణరెడ్డిపై ఒత్తిడి తెస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే మూడు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ డెరైక్టర్లతోనే జూలై 11న అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇప్పించారు. ఈ నేపథ్యంలో డీసీవో ఆగస్టు 8న డెరైక్టర్లందరికీ నోటీసులు జారీ చేశారు. దీనిపై నారాయణరెడ్డి జిల్లా సహకార అధికారికి సమావేశం నిర్వహించే అధికారం లేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. కొంత కాలంగా హైకోర్టు ఆదేశానుసారం తీర్మానం నిలిచిపోయింది.

 తాజాగా స్టే వేకెంట్ కావడంతో మళ్లీ శుక్రవారం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ అవిశ్వాస తీర్మానానికి అనుకులంగా ఏడుగురు సభ్యులు (మూడింట రెండు వంతులు) ఓటేస్తే చైర్మన్, వైస్ చైర్మన్లు పదవి నుంచి వైదొలుగుతారు. ప్రస్తుతం ఏడుగురు సభ్యులు గులాబీ పార్టీ అండదండలతో క్యాంపుల్లో ఉన్నారు. దీంతో అవిశ్వాసం నెగ్గడంఖాయంగా కనిపిస్తోంది. కొంత కాలంగా చైర్మన్ నారాయణరెడ్డి, వైస్‌చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు సాధ్యం కాలేదు.

 కుట్రలతోనే రాజీనామా..
 2005 నుంచి ఇప్పటివరకు అధ్యక్ష పదవి చేపట్టానని, గతంలో జిల్లా మార్కెట్ సంఘం తీవ్ర సంక్షోభంలో ఉండేదని.. ఇప్పుడు రూ.60 లక్షల లాభాల్లో ఉందని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణరెడ్డి స్పష్టం చేశారు. డీసీవో సూర్యచందర్‌రావుకు రాజీనామా పత్రం అందజేశాక మాట్లాడారు. రాజకీయ ఒత్తిళ్లు, బ్లాక్‌మెయిల్ రాజకీయాలతోనే తాను రాజీనామా చేశానని పేర్కొన్నారు. రాజీనామా సమర్పించే సమయంలో ఆయనతోపాటు టీపీసీసీ కార్యదర్శి నరేష్‌జాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింగ్‌రావు, సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, లక్ష్మణచాంద సర్పంచ్ నారాయణ, డీసీసీ మెంబర్ రాధాకిషన్ ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement