అపోహలకు తావివ్వకండి: నరసింహన్
* తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులతో గవర్నర్ నరసింహన్
* ‘ఎట్ హోం’ అనంతరం 45 నిమిషాలు ఏకాంతంగా భేటీ
* ఎంసెట్, నాగార్జునసాగర్ వివాదంపై మంతనాలు!
* చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచన
* ఆహ్లాదంగా సాగిన ‘ఎట్ హోం’ కార్యక్రమం
* హాజరైన ఇరు రాష్ట్రాల మంత్రులు, నేతలు, ప్రముఖులు
* అందరి దగ్గరికీ వెళ్లి చొరవగా పలకరించిన గవర్నర్ దంపతులు
సాక్షి, హైదరాబాద్: ‘‘రెండు రాష్ట్రాల మధ్య ఏవైనా సమస్యలు ఉంటే కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకోండి. అనవసరమైన అపోహలకు అవకాశం కల్పించకండి. లేని వివాదాలకు తావివ్వకండి...’’.. అని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. 66వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో నిర్వహించిన ‘ఎట్ హోం’ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హాజరయ్యారు. ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం కేసీఆర్, చంద్రబాబుతో తన నివాసంలో గవర్నర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశం దాదాపు 45 నిమిషాల పాటు సాగింది.
కొద్దిరోజులుగా తెలంగాణ, ఏపీ మధ్య ఎంసెట్ నిర్వహణతోపాటు ప్రాజెక్టుల్లో నీళ్లు, విద్యుత్ తదితర అంశాలపై వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దాంతో ఇప్పటికే ఇరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో పలుమార్లు గవర్నర్ భేటీ అయ్యారు. ఒకసారి ఇద్దరు సీఎంల తోనూ సమావేశం జరిగినా సమస్య ఓ కొలిక్కి రాలేదు. ఈ సమస్యలను చర్చించుకుని పరిష్కరించుకోవాలని నరసింహన్ పలుమార్లు సూచించారు కూడా. ఈ నేపథ్యంలో ‘ఎట్ హోం’ రూపంలో కలిసివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న గవర్నర్ ఇద్దరు సీఎంలను కూర్చోబెట్టి చర్చించారు. ఎంసెట్ మాత్రమేగాకుండా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి విడుదల వ్యవహారం ఇటీవల ప్రధాన సమస్యగా మారింది. సాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. కృష్ణా నదీ జలాల వివాదం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ అంశాలపైనా సీఎంల మధ్య చర్చ జరిగి నట్లు భావిస్తున్నారు. ఎంసెట్ నిర్వహణపై పంతానికి పోకుండా చెరో ఏడాది నిర్వహించుకోవాలని గవర్నర్ సూచించినట్లు సమాచారం.
ఇద్దరు సీఎంలు మాట్లాడుకుంటారు
ఈ భేటీకి ముందు ‘ఎట్ హోం’ కార్యక్రమం నుంచి సీఎంలను తన నివాసంలోకి తీసుకుని వెళుతూ గవర్నర్ మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. ‘‘రెండు రాష్ట్రాల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. చూస్తున్నారు కదా.. ఇద్దరు సీఎంలూ ఎంతో ఆనందంగా ఉన్నారు. అందరికీ మంచి జరిగేలా, అన్ని సమస్యలపై ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటారు..’’ అని గవర్నర్ చెప్పారు.
అందరికీ పలకరింపు: ‘ఎట్ హోం’ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మంత్రులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల స్పీకర్లు మధుసూదనాచారి, కోడెల శివప్రసాద్, తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ హాజరయ్యారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, నాయిని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు, కేటీఆర్ సహా మంత్రులంతా వచ్చారు. ఏపీ ప్రభుత్వం నుంచి మాత్రం మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, అచ్చెన్నాయుడు హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి సీఎల్పీ నేత జానారెడ్డి, డి.శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య, సీపీఐ నుంచి చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. అధికార టీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలూ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఇరు రాష్ట్రాల మంత్రులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలు, అధికారులను ఒక్కో టేబుల్ వద్దకు వెళుతూ గవర్నర్ దంపతులు కలిశారు.
ఇద్దరు ‘చంద్రుల’ ముచ్చట్లు
‘ఎట్ హోం’కు హాజరైన కేసీఆర్, చంద్రబాబు కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. కార్యక్రమంలో గవర్నర్ సీటుకు అటూ ఇటూ ఇద్దరు ముఖ్యమంత్రులకు సీట్లు కేటాయించారు. అయితే గవర్నర్ సీట్లో లేని సమయంలో కేసీఆర్, చంద్రబాబు ఒకొరికొకరు దగ్గరగా వచ్చి మాట్లాడుకున్నారు. దీనిని చూసిన నేతలంతా... ఆ ఇద్దరు సీఎంలు ఏం మాట్లాడుకుని ఉంటారని ఆసక్తిగా చర్చించుకోవడం కనిపించింది. ‘ఏపీ రాజధానిని తుళ్లూరులోనే ఏర్పాటు చేసుకోండి. నదికి అభిముఖంగా రాజధాని నగరం ఉంటే మంచిది..’ అని చంద్రబాబుతో కేసీఆర్ వ్యాఖ్యానించారని తెలిసింది.