సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ నానల్‌నగర్‌లోని భూములకు నకిలీ పత్రాల ఆధారంగా నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవడంలో తాత్సారం ఎందుకు చేస్తున్నారని ఉమ్మడి హైకోర్టు తెలంగాణ సర్కార్‌ను ప్రశ్నించింది. ఎన్‌ఓసీ ఇచ్చిన కమిటీలోని వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలన్న సింగిల్ జడ్జి ఆదేశాల్ని అమలు చేయకపోవడానికి కారణమేమిటని బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం నిలదీసింది. బాధ్యులపై చర్యలకు మీనమేషాలు లెక్కిస్తున్నారనే అభిప్రాయం ఏర్పడుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మీనాను స్వయంగా హాజరుకావాలన్న ఆదేశాల తర్వాతే అప్పటి హైదరాబాద్ కలెక్టర్ నవీన్‌మిట్టల్‌కు మెమో ఇచ్చారని హైకోర్టు పేర్కొంది.
నిరభ్యంతర పత్రం ఇచ్చిన అప్పటి హైదరాబాద్ కలెక్టర్‌గా ఉన్న ఎన్‌ఓసీ చైర్మన్ నవీన్‌మిట్టల్, సంయుక్త కలెక్టర్ దుర్గాప్రసాద్, అధికారులు వెంకటరెడ్డి, పి.మధుసూధన్‌రెడ్డి ఇతరులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సింగిల్ జడ్జి ఆదేశించారు. దీనిని సవాల్ చేస్తూ నవీన్‌మిట్టల్, సయ్యద్ వేరువేరుగా అప్పీల్ పిటిషన్లు వేశారు. వీటిని ధర్మాసనం విచారించింది. సయ్యద్, మరో ఇద్దరిని ప్రాసిక్యూషన్ జరపాలని గతంలో సింగిల్ జడ్జి ఆదేశిస్తే.. కోర్టు తీర్పు ప్రతితో తహసీల్దార్ పోలీసులకు ఎలా ఫిర్యాదు చేస్తారని ధర్మాసనం తప్పుపట్టింది. దీంతో అడ్వొకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి చెప్పారు. సయ్యద్ మరో ఇద్దరిపై ప్రాసిక్యూషన్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. విచారణ మూడు వారాలకు వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment