సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బుధవారం శాసనసభలో రూ.1,00,637.96 కోట్లతో ప్రవేశపెట్టిన 2014-15 వార్షిక బడ్జెట్‌లో జిల్లాకు అంతగా ప్రాధాన్యత దక్కలేదు. 2013-14 బడ్జెట్‌లో జిల్లా సాగునీటి పథకాలకు రూ.922 కోట్లు కేటాయిస్తే.. ఈ సారి రూ.346.90 కోట్లు ఇచ్చారు. ఏడు జిల్లాలకు చెందిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు రూ.1790 కోట్లు కేటాయించినా జిల్లా వాటా తేల్చలేదు.
ఇందిర జలప్రభ, పావలా వడ్డీ, వడ్డీ లేని రుణం... తదితర పథకాలపై పాత కేటాయింపులను ప్రభుత్వం బడ్జెట్‌లో వల్లె వేసిందని, ప్రధాన అంశాలను పక్కన బెట్టిందన్న చర్చ జరగుతోంది. రహదారులు, మౌళిక వసతుల కల్పనల కోసం బడ్జెట్ కేటాయింపుల్లో జిల్లాకు చోటు దక్కగా పోగా.. ప్రభుత్వ బడ్జెట్‌పై రాజకీయ పక్షాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.
ఏడు సాగునీటి పథకాలకు.. అమరులకు..
భారీ ప్రాజెక్టులుగా రెండేళ్ల కాలంలో నిర్లక్ష్యానికి గురైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు ఈసారి బడ్జెట్‌లో రూ.1790 కోట్లు కేటాయించారు. అయితే జిల్లాలో 20, 21, 22 ప్యాకేజీలకు మాత్రం కేటాయింపులు జరగలేదు. గత బడ్జెట్‌లో ప్రాణహిత-చేవెళ్లకు రూ.1051 కేటాయించిన అప్పటి ప్రభుత్వం పైసా విదిల్చలేదు.
2013-14 బడ్జెట్‌లో ఎస్సారెస్పీ స్టేజ్-1కు రూ.160 కోట్లు కేటాయించగా ఈసారి రూ.63.40 కోట్లకే సరిపుచ్చారు. లెండి ప్రాజెక్టుకు గతంలో రూ.45 కోట్లు కేటాయించినా నిధులు విడుదల కాకపోయినా.. ఈ సారి రూ.3 కోట్లకే పరిమిత చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి. నిజాంసాగర్ ఆధునీకరణ పనుల బడ్జెట్ రూ.180 కోట్ల నుంచి ఈసారికి రూ.69.50 కోట్లకు తగ్గింది.
జిల్లా నుంచి కరీంనగర్‌కు విస్తరించిన ఇందిరమ్మ వరద కాల్వ నిర్మాణం కోసం గతంలో రూ.400 కోట్లు కేటాయించి రూ.140 కోట్లే ఖర్చు చేయగా.. ఈ సారి ఆ బడ్జెట్‌ను తగ్గించి రూ.200 కోట్లకు పరిమితం చేశారు. రూ.10 కోట్లున్న చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతలకు రూ.1కోటి, అలీసాగర్, గుత్పలకు రూ.12 కోట్ల నుంచి రూ.2 కోట్లకు, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన సింగూరు ప్రాజెక్టుకు రూ.40 కోట్ల నుంచి రూ.8 కోట్లకు బడ్జెట్ కుదించారు.
సాగునీటి పథకాలకు అంతంతమాత్రంగానే నిధులు కేటాయించారన్న వాదనలు వినిపిస్తుండగా.. జిల్లాలో 757 చెరువుల మరమ్మతులకు మొదటి విడతగా రూ.200 కోట్ల వరకు రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించే అవకాశం ఉందని అధికారపార్టీ నేతలు ఊరడిస్తున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 459 మంది తెలంగాణ అమరవీరులకు రూ.100 కోట్లు బడ్జెట్‌లో కేటాయించగా, జిల్లాకు చెందిన 31 మంది కుటుంబాలకు రూ.3.10 కోట్లు అందనున్నాయి. శాసనసభ నియోజకవర్గం అభివృద్ధి నిధులు (ఏసీడీపీ) రూ.1కోటి నుంచి రూ.1.50 కోట్లకు పెంచడంతో జిల్లాకు ఇకపై ప్రతి సంవత్సరం అదనంగా రూ.4.50 కోట్లు రానున్నాయి.
కేటాయింపులపైనే ఆధారం...
ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలిపద్దులో జిల్లాకు ప్రత్యక్షంగా చేకూర్చిన ప్రయోజనం ఏమీ లేదన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి. వైద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాలకు కేటాయింపులు ప్రత్యక్షంగా జరగలేదంటున్నారు. మొత్తంగా వైద్య రంగానికి రూ.2,882 కోట్లు కేటాయిస్తే.. జిల్లాలో ప్రసిద్ధిగాంచిన వైద్య కళాశాల, జిల్లా కేంద్ర ఆసుపత్రుల ఊసులేదు.
రహదారుల నిర్మాణానికి రూ.800ల కోట్ల నుంచి రూ.1000 కోట్ల వరకు అవసరం ఉంటాయని సంబంధిత శాఖ అధికారులు జిల్లా ప్రజాప్రతినిధుల ద్వారా ప్రతిపాదనలు పంపించారు. 3,169 చెరువులకు గాను 757 చెరువుల ఆధునీకరణకు ప్రభుత్వం హామీ ఇచ్చిన ఉమ్మడి బడ్జెట్‌లోనే నిధులు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 2.97 లక్షల ఎకరాలకు సాగునీరు అదనంగా ఇస్తామన్నా.. జిల్లా ప్రాజెక్టుల ప్రస్తావన రాలేదు.
125 గజాల స్థలంలో రూ.3.50 లక్షల వ్యయంతో రెండు పడక గదులతో పేదలకు పక్కాఇళ్లు నిర్మిస్తామన్న హామీ ఉండగా.. బడ్జెట్ కేటాయింపుల ప్రకారం నియోజకవర్గానికి 250 ఇండ్లకు మించి వచ్చే అవకాశం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన పసుపు పరిశోధన కేంద్ర, చక్కెర కర్మాగారం పునరుద్ధరణ, గల్ఫ్‌బాధితుల ప్రత్యేక విభాగం, వంగడాల పరిశోధన కేంద్రాలు తదితర హామీలు నెరవేర్చే అంశాలు బడ్జెట్‌లో కనిపించలేదు. రెండు పార్లమెంట్, 9 అసెంబ్లీ స్థానాలను ఏకపక్షంగా గెలిపించిన ఇందూరు జిల్లాకు ప్రభుత్వ బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు ఉంటాయని భావించగా.. ఆ మేరకు ప్రాతినిధ్యం కల్పించలేదంటున్నారు.
జిల్లాకు దక్కని ప్రాధాన్యం...
Published Thu, Nov 6 2014 3:05 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement