ఫోరెన్సిక్ ల్యాబ్కు 14 ఆడియో, వీడియో టేపులు
ఓటుకు కోట్లు కేసు కీలక ఘట్టానికి చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి స్వాధీనం చేసుకున్న సాక్ష్యాలను మరింత నిర్ధారణ కోసం ఏసీబీ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపింది. రెండు సెల్ఫోన్లు, కెమెరాలు, రేవంత్ రెడ్డి ఇంట్లో స్వాధీనం చేసుకున్న సీపీయూలను ల్యాబ్కు పంపారు. అలాగే మొత్తం 14 ఆడియో, వీడియో టేపులను కూడా ల్యాబ్కు పంపారు. ఆడియోలో ఉన్నది తన గొంతు కాదంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న వాదనల నేపథ్యంలో ఆధారాలను ల్యాబ్కు పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ 14 ఆడియోలో, వీడియో టేపుల్లో ఉన్న వాస్తవ అంశాలను ల్యాబ్ శాస్త్రీయ రీతిలో నిర్ధారణ చేయనుంది. రెండు రోజుల్లో ల్యాబ్ నిర్ధారించిన అంశాలు ఏసీబీకి, కోర్టుకు చేరనున్నాయి.
మరోవైపు ఈ కేసులో కీలక సాక్షి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ఏసీబీ కోర్టు అనుమతి కోరింది. శనివారం స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని నమోదు చేసే అవకాశాలున్నాయి. సెక్షన్ 164 కింద తీసుకునే ఈ వాంగ్మూలం కేసు దర్యాప్తులో అత్యంత కీలకం కానుంది. తనను ఎవరెవరు ప్రలోభ పెట్టారో, తనతో ఎవరు, ఎన్నిసార్లు మాట్లాడారో, డబ్బు ముట్టజెప్పింది ఎవరో అనే అంశాలను స్టీఫెన్సన్ తన వాంగ్మూలంలో వెల్లడించే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి స్టీఫెన్సనే ఫిర్యాదు దారు కాబట్టి, ఆయన వాంగ్మూలం కేసుకు అత్యంత కీలకమైనదని న్యాయనిపుణులు చెబుతున్నారు.