
ఎన్పీడీసీఎల్ ఏడీఈకి ఏసీబీ షాక్
గోదావరిఖని : బిల్లుల క్లియరెన్స్‌కు కాంట్రాక్టర్ వద్ద రూ.20 వేలు లంచం తీసుకుంటూ గోదావరిఖని ఏరియా ఎన్పీడీసీఎల్ ఏడీఈ(ఎలక్ట్రికల్) గౌతం మధుసూదన్ ఏసీబీకి చిక్కాడు.
గోదావరిఖని :
బిల్లుల క్లియరెన్స్‌కు కాంట్రాక్టర్ వద్ద రూ.20 వేలు లంచం తీసుకుంటూ గోదావరిఖని ఏరియా ఎన్పీడీసీఎల్ ఏడీఈ(ఎలక్ట్రికల్) గౌతం మధుసూదన్ ఏసీబీకి చిక్కాడు. రామగుండం ఈస్ట్, వెస్ట్, మేడిపల్లి డివిజన్ల పరిధిలో ఇంట్లో ఉన్న విద్యుత్ మీటర్లను బయట పెట్టించేందుకు ఫెర్నిత్ ఎలక్ట్రికల్ వర్క్‌కు చెందిన సుధమల్ల శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్‌కు అప్పగించారు. మూడు డివిజన్ల పరిధిలోని 1,620 విద్యుత్ మీటర్లను ఇంట్లో నుంచి బయటకు మార్పు చేయించారు.
ఇందుకు సంబంధించి మొత్తం రూ.3.24 లక్షల బిల్లు అయింది. ఈ బిల్లుల చెల్లింపునకు ఆయా డివిజన్ల ఏఈలు సంతకాలు చేయగా... దానిని పరిశీలించి ఏడీఈ గౌతం మధుసూదన్ కూడా సంతకం చేసి ఆ ఫైల్‌ను డీఈ పరిశీలనకు పంపాల్సి ఉంటుంది. అయితే నాలుగు నెలలుగా ఫైల్ తన వద్దనే పెట్టుకుని లంచం కోసం కాంట్రాక్టర్ శ్రీనివాస్‌ను ఇబ్బంది పెట్టాడు. దీంతో విసుగు చెందిన కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
సోమవారం సాయంత్రం 5 గంటలకు ఏడీఈ కార్యాలయంలో శ్రీనివాస్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ మాట్లాడుతూ మంగళవారం ఏడీఈని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని, గతంలో అతడిపై వచ్చిన ఆరోపణలపైనా విచారణ చేస్తామని చెప్పారు. కాగా, మంచిర్యాల పట్టణంలోని గోసేవా మండల్ రోడ్డులో గల ఏడీఈ నివాసంలో కూడా ఏసీబీ అధికారులు సోమవారం రాత్రి సోదాలు నిర్వహించారు.