సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : యూరియా కేటాయింపుల్లో జిల్లా అధికార యంత్రాంగం జిమ్మిక్కులు చేస్తోంది. నిబంధనలు తుంగలో తొక్కి ప్రైవేటు డీలర్లకు అధికారులు వంత పాడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం జిల్లాకు వచ్చిన యూరియాలో 50 శాతం నిల్వలను సహకార సంఘాలకు కేటాయించి వాటి ద్వారా విక్రయాలు చేపట్టాలి.
అలా చేస్తేనే ప్రైవేటు డీలర్లు కృత్రిమ కొరత సృష్టించకుండా చాలా మట్టుకు అడ్డుకట్ట వేయవచ్చు. కానీ ప్రైవేటు డీలర్లతో వ్యవసాయ, మార్క్‌ఫెడ్ అధికారులకు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా యూరియా నిల్వలను ప్రైవేటు డీలర్లకే కట్టబెడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. అధిక ధరలకు విక్రయించి రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 60 సహకార సంఘాలున్నాయి. కానీ పాత బకాయిల పేరుతో 20 సహకార సంఘాలకు అధికారులు ఒక్క బస్తా కేటాయించలేదు. పైగా రైతుల నుంచి ఎక్కువ డిమాండ్ ఉన్న బ్రాండ్ యూరియాను ప్రైవేటు డీలర్లకు కేటాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మార్క్‌ఫెడ్‌కు కేటాయించిన నిల్వల నుంచి కూడా అధికారులు కొందరు ప్రైవేటు డీలర్లకే కేటాయింపులు జరిపినట్లు తెలుస్తోంది.
తీవ్రమవుతున్న యూరియా కష్టాలు
ఈ ఖరీఫ్ సీజన్‌లో 89,513 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు కేటాయింపులు జరపాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కానీ.. ప్రభుత్వం కేవలం 62,068 మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించింది. ఆగస్టుకు సంబంధించి 35,112 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు అవసరమని గుర్తించగా.. ఇప్పటివరకు 9,470 మెట్రిక్ టన్నులు మాత్రమే యూరియా వచ్చింది. ఈ యూరియా నిల్వల్లో అధిక భాగం డీలర్ల గుప్పిట్లోకి చేరడంతో అన్నదాతల ఎరువు కష్టాలు తీవ్ర రూపం దాల్చుతోంది.
అదనపు దోపిడీ
ఒక్కో బస్తా రూ.284 చొప్పున విక్రయించాల్సి ఉండగా.. అదనంగా రూ.50 నుంచి రూ.వంద వరకు వసూలు చేస్తున్నారు. ఇదేంటని రైతులు ప్రశ్నిస్తే స్టాకు లేదని సాకు చెబుతున్నారు. ఇటీవల బేల మండల కేంద్రంలో ఓ డీలరు రూ.350కు తక్కువ విక్రయించేది లేదని తేల్చిచెప్పడంతో రైతులు వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తెచ్చారు. విచారణ చేపట్టిన అధికారులు సదరు డీలరుకు నోటీసులతో సరిపెట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
డిమాండున్నా వేధిస్తున్న కొరత..
జిల్లాలో యూరియా కొరత తీవ్ర రూపం దాల్చుతోంది. రెండు మూడురోజులు పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. పత్తి, వరి, కంది, మొక్కజొన్న, జొన్న తదితర పంటలకు రైతులు యూరియా వేస్తున్నారు. దీంతో పెరిగిన డిమాండ్ మేరకు జిల్లాలో యూరియా అందుబాటులో లేక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు యూరియా కష్టాలపై అధికారులను నిలదీశారు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం ఈ యూరియా కేటాయింపులపై విచారణ జరిపితే అక్రమాలు వెలుగుచూసే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
డీలర్ల గుప్పిట్లో యూరియా
Published Fri, Aug 29 2014 12:12 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement