27లక్షల మందికి ధీమా | Officials To Cover 27 Lakh Farmers Under Rythu Bheema Scheme | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 6 2018 1:03 AM | Last Updated on Mon, Aug 6 2018 10:16 AM

Officials To Cover 27 Lakh Farmers Under Rythu Bheema Scheme - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల మంది రైతులకు ‘రైతు బీమా’పత్రాలను పంపిణీ చేసేందుకు సర్కారు సర్వం సిద్ధం చేసింది. సోమవారం నుంచి గ్రామసభలు నిర్వహించి రైతులకు బీమా బాండ్లను అందజేయనుంది. ఈనెల 14వ తేదీ నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వ్యవసాయ వర్గాలు తెలిపాయి. రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం మాదిరిగా.. దాదాపు అదే పద్ధతిలో బీమా బాండ్లను రైతులకు అందజేస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, రైతు సమితి సభ్యుల ఆధ్వర్యంలో గ్రామసభను ఏర్పాటు చేసి జీవిత బీమా బాండ్లను అర్హులైన రైతులందరికీ ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి గ్రామాల్లో చాటింపు వేస్తారు. ముందుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసిన అర్హుల జాబితాకు అనుగుణంగా పంపిణీ చేయనున్నారు. ఆ మేరకు రాష్ట్రంలో 562 మండలాల్లోని 9,867 గ్రామాల్లో 20,79,469 రైతు బీమా బాండ్ల పంపిణీకి అధికారులు సిద్ధం చేశారు. ఈనెల 14 నుంచి బీమా అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో 14వ తేదీకి ముందుగానే బాండ్లను రైతుల చెంతకు చేర్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ముద్రితమైన బాండ్లు ఇప్పటికే మండలాలకు చేర్చారు. మిగిలిన వాటిని కూడా ఎప్పటికప్పుడు ముద్రించి, గడువులోగానే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు.

14.48 లక్షల మంది అనర్హత  
ఎల్‌ఐసీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్న, రైతుబంధు చెక్కు పొందిన ప్రతి రైతుకూ రాష్ట్ర ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పిస్తోంది. బీమా తీసుకున్న రైతు చనిపోతే సంబంధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందనుంది. ఇందుకు సంబంధించి పూర్తి నిధులను ప్రభుత్వం ఇప్పటికేఎల్‌ఐసీకి విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 48.77 లక్షల మంది రైతులకు రైతుబంధు చెక్కులను పంపిణీ చేశారు. వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం ఈనెల 2వ తేదీ వరకు 47.31 లక్షల మంది రైతులు బీమా కోసం వ్యవసాయ విస్తరణాధికారులను సంప్రదించారు.

ఇందులో 27,00,416 మంది రైతులు నిబంధనలకు అనుగుణంగా బీమాకు అర్హులయ్యారు. ఇందులో 20,79,469 బీమా బాండ్లను ఇప్పటికే ముద్రించి జిల్లాలకు పంపారు. మొత్తం రైతుల్లో 14.48 లక్షల మంది (35 శాతం మంది) వయస్సు నిబంధన, రెండు ఖాతాల వల్ల అనర్హులు, బీమాలో చేరేందుకు ఇష్టపడని వారు ఉన్నారు. అందులో 2 లక్షల మంది వరకు బీమా తీసుకునేందుకు తిరస్కరించారు. బీమా పాలసీని వివరించే పద్ధతి సక్రమంగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని సమాచారం. మరోవైపు బీమా బాండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చాలా హుందాగా నిర్వహించాలని సర్కారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. బాధ్యతగా నిర్వహించాలని ఆదేశించింది. సున్నితమైన వ్యవహారం కాబట్టి జాగ్రత్తగా, విమర్శలు రాకుండా బాండ్ల పంపిణీ చేపట్టాలని సూచించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement