
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్ నేపథ్యంలో తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్లకు ఆన్‌లైన్‌లో శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి 15 రోజుల పాటు ‘డిజిటల్ దిశ’ పేరుతో ఆన్‌లైన్ క్లాసులు జరుగనున్నాయి. ఇందులో భాగంగా 5300 మంది లెక్చరర్లను 12 బ్యాచ్‌లుగా విభజించి డిజిటల్ తరగతులు, ఆన్‌లైన్ విద్యా బోధనపై శిక్షణ ఇవ్వనున్నారు. కాగా మహమ్మారి కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా విద్యాసంస్థలన్నీ మూతపడిన విషయం తెలిసిందే. అదే విధంగా కరోనా విజృంభణ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడప్పుడే విద్యా సంస్థలు తెరిచే అవకాశం కనబడటం లేదు. దీంతో డిజిటల్ తరగతులకు ప్రాధాన్యం పెరగడంతో ఆ దిశగా లెక్చరర్లను సమాయత్తం చేసేందుకు ఈ శిక్షణా కార్యక్రమం ఉపయోగపడనుంది.(ఆన్‌లైన్ పాఠాలు; ఆసక్తికర అంశాలు)