
విపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రేఖ, సురేఖ, లక్ష్మి, శోభ
హైదరాబాద్: ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారం అందించాలని, బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే కృషిలో కలసి రావాలని టీఆర్‌ఎస్ మహిళా శాసనసభ్యులు అజ్మీరా రేఖ, కొండా సురేఖ, బొడిగె శోభ, కోవ లక్ష్మి విపక్షాలను కోరారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు మీడియాతో మాట్లాడారు. సభలో కేసీఆర్ చేసిన ప్రసంగం ప్రజల్లో ఉన్న అనుమానాలు తొలగించిందని పేర్కొన్నారు. రుణాల రీషెడ్యూలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని సీఎం చెప్పారని, ఈ అంశాలపై విపక్షాలు గందరగోళం సృష్టించవద్దని సూచించారు.
సాహసోపేత నిర్ణయం: జూపల్లి, రవీందర్‌రెడ్డి
20 వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించడం సాహసోపేతమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, ఏనుగు రవీందర్‌రెడ్డి అన్నారు. బంగారు ఆభరణాలమీద తీసుకున్న రుణాలకు కూడా మాఫీ వర్తిస్తుందని ప్రకటించడంతో విపక్షాలకు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి ఎదురయ్యిందన్నారు. రుణమాఫీపై కొన్నిపార్టీలు రైతులను తప్పుదోవ పట్టించాయన్నారు. ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నాలను మానుకోవాలని వారు కోరారు.
రిజర్వేషన్ల హామీపై అనుమానాలు: జీవన్‌రెడ్డి
శాసనసభలో ముఖ్యమంత్రి మాటలను వింటే ముస్లిం రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకుంటారా అన్న సందేహం కలుగుతున్నదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టి. జీవన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో స్పష్టమైన హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు ముస్లింల కు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నం చేస్తామనడం బాధ్యతారాహిత్యమేనన్నా రు. తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థులను స్వాతంత్య్ర సమరయోధులుగా ప్రకటించడం సాధ్యం కాదని చెప్పడం ఉద్యమకారులను అవమానించడమేనన్నారు.
ఏపీ సచివాలయం ఎల్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనా కేంద్రమైన సచివాలయంలోని ఎల్ బ్లాక్ మూడో అంతస్తులో శుక్రవారం సాయంత్రం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. స్విచ్‌బోర్డు వద్ద షార్ట్ సర్క్యూట్ అవడంతో మంటలు రేగాయి. అయితే అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు. ఈ సంఘటనలో ఎలాంటి ఆస్తినష్టం వాటిల్లలేదు. ఇదే ఎల్ బ్లాక్‌లోని 8వ అంతస్తులో ఆంధ్రప్రదేశ్ సీఎం కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుండడం తెలిసిందే.