హరీష్‌నుద్దేశించి చమత్కరించిన గీతారెడ్డి
సాక్షి, సంగారెడ్డి: ‘రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా.... మా మెదక్ జిల్లాకు మాత్రం మీరే ముఖ్యమంత్రి’ అంటూ మాజీ మంత్రి, జహీరాబాద్ ఎమ్మెల్యే గీతారెడ్డి మంత్రి హరీష్‌రావునుద్దేశించి చమత్కరించారు. శనివారం సంగారెడ్డిలోని జెడ్పీ కార్యాలయంలో జిల్లా ప్రణాళికపై ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరిగింది.
సమావేశంలో శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్‌ను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గీతారెడ్డి, కిష్టారెడ్డిలు ఘనంగా సన్మానించారు. అనంతరం గీతారెడ్డి మాట్లాడుతూ, గత జెడ్పీ సమావేశంతో పోలిస్తే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యిందన్నారు. గతంలో తాము మంత్రులుగా వేదికపై ఉంటే... ఇప్పుడు మీరు వేదికపై ఉన్నారంటూ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రి హరీష్‌ను ఉద్దేశించి అన్నారు. గత సమావేశంలో ఎమ్మెల్సీగా నా పక్కగా కూర్చున్న స్వామిగౌడ్‌కు మంత్రి పదవి దక్కుతుందని అనుకున్నా, కానీ మంత్రులను శాసించే శాసనమండలి చైర్మన్ పదవి దక్కటం ఆనందంగా ఉందన్నారు. సీఎం చంద్రశేఖర్‌రావు తర్వాత మంత్రివర్గంలో ముఖ్యభూమిక పోషిస్తున్న నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు జిల్లా అభివృద్ధికి పెద్దపీట వేయాలి.. ఇప్పుడు హరీష్‌రావే జిల్లాకు ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి గీతారెడ్డి మాటలు విన్న మంత్రి హరీష్‌రావు, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు.
మా జిల్లా సీఎం మీరే
Published Sun, Jul 27 2014 12:13 AM | Last Updated on Thu, Aug 16 2018 1:18 PM
Advertisement
Advertisement