ఏడాదిలోగా పాలమూరు– రంగారెడ్డి | Palamuru Rangareddy Lift Irrigation Project Will Complete Within A Year | Sakshi
Sakshi News home page

ఏడాదిలోగా పాలమూరు– రంగారెడ్డి

Published Fri, Aug 30 2019 12:43 PM | Last Updated on Fri, Aug 30 2019 12:43 PM

Palamuru Rangareddy Lift Irrigation Project Will Complete Within A Year - Sakshi

వట్టెం వద్ద ప్రాజెక్టు గురించి సీఎంకు వివరిస్తున్న అధికారులు

సాక్షి, నాగర్‌కర్నూల్‌/ వనపర్తి: వచ్చే వర్షాకాలం నాటికి పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాతోపాటు రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాలకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పారు. గురువారం పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనుల పరిశీలనకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించారు. కర్వెన, వట్టెం, నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్ల పరిశీలన అనంతరం ఏదుల రిజర్వాయర్‌ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే ఉమ్మడి పాలమూరు జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు.

ప్రగతి నిరోధకులు కేసులు వేయడం వల్లనే ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయని వెల్లడించారు. జూరాల నుంచి పాలమూరు ఎత్తిపోతలకు కృష్ణాజలాలను తీసుకోవాలంటూ.. ఈ జిల్లాకు చెందిన వారే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో జూరాల ద్వారానే సాగునీటితోపాటు మిషన్‌ భగీరథ తాగునీరు అందిస్తున్నామని, చిన్న ప్రాజెక్టు అయిన జూరాల నుంచి పాలమూరు ఎత్తిపోతలకు జలాలను ఎత్తిపోస్తే.. సామర్థ్యం సరిపోదనే కనీస  అవగాహన లేకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికే జూరాల నుంచి అన్ని రిజర్వాయర్లకు, ప్రాజెక్టులకు, తాగునీటి కోసం దాదాపు 71.1 టీఎంసీల నీటిని వాడుకుంటున్నామన్నారు.

శ్రీశైలం ప్రాజెక్టు సామర్థ్యం 200 టీఎంసీలపైగా ఉంటుంది కాబట్టి.. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ నుంచి ముందుచూపుతో పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అనుసంధానం చేశామన్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ తదితర ప్రాజెక్టుల ద్వారా 11.20 లక్షల ఎకరాలకు నీరందిస్తున్నామని సీఎం చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు, ఎత్తిపోతల ద్వారా గొలుసుకట్టు చెరువులను నింపేందుకు రూ.4 వేల కోట్లు విడుదల చేశామన్నారు. ప్రతి ఏటా ఉమ్మడి జిల్లాలో వెయ్యి నుంచి 1,500 చెరువులను కృష్ణాజలాలతో నింపుతున్నామని గుర్తు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులతోపాటు పాలమూరు ప్రాజెక్టు పనులు పూర్తయితే వచ్చే ఖరీఫ్‌ నాటికి నీరందించేందుకు తొల విడతగా.. కర్వెన, ఉద్దండాపూర్‌తో వికారాబాద్‌ జిల్లాకు సాగునీరు ఇస్తామన్నారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు ఎలాంటి నిధుల కొరత లేదని రూ.10 వేల కోట్లు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా అప్పు తీసుకున్నామని, వచ్చే  ఏడాది బడ్జెట్‌లో కూడా నిధులు కేటాయించి పూర్తి చేస్తామన్నారు. 

మూడు షిఫ్టుల్లో పనులు 
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 15 నుంచి 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను కాళేశ్వరం తరహాలో మూడు షిఫ్టుల్లో నిరంతరాయంగా చేపట్టి ఏడాదిలోగా పూర్తిచేస్తామని సీఎం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చేపట్టినప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా అని ప్రతిపక్షాలు హేళన చేస్తూ మాట్లాడయని, కాళేశ్వరం పూర్తయిన తర్వాత ఇదో అద్భుతమంటూ ప్రపంచమే ప్రశంసలు కురిపించిందని కేసీఆర్‌ గుర్తుచేశారు. వందకు వందశాతం పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పూర్తిచేసి సాగునీరు అందించి ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు.

హైదరాబాద్‌లో విలువైన భూములను కూడా అమ్మకానికి పెట్టామని.. వచ్చిన డబ్బులను పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయిస్తామని చెప్పారు. ఇకపై పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతాయని, ప్రతి పదిహేను రోజులుకు ఒకసారి పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను తాను స్వయంగా పర్యవేక్షిస్తానని సీఎం చెప్పారు. ప్రాజెక్టు పరిశీలనలో సీఎం వెంట వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీలు రాములు, శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అబ్రహం, పట్నం నరేందర్‌రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement