
కుంభకోణాల్లో మునిగిన కాంగ్రెస్
కుంభకోణాల్లో మునిగి తేలిన కాంగ్రెస్ నేతలు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.
మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కుంభకోణాల్లో మునిగి తేలిన కాంగ్రెస్ నేతలు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్లు తమ ప్రభుత్వ హయాంలో చేసిన అవినీతే టీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనూ జరుగుతుందన్న ఊహల్లో ఉన్నారని, సంచలన వార్తల కోసమే కాంగ్రెస్ నేతలు చిల్లర ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యదర్శి మాదాడి రమేశ్ రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. పారదర్శకంగా, మచ్చ లేని పాలనను టీఆర్‌ఎస్ అందిస్తోందని, కానీ, ప్రతిపక్ష నేతలు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ నేతలకు ఎక్కడ అవినీతి కనిపించినా ఆధారాలు బయట పెట్టాలని, వారి మాటలు నిజమైతే ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆరోపణలకు ఆధారాలు చూపకపోతే తాము చూస్తూ ఊరుకోమని, కేసులు పెడతామని హెచ్చరించారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అయితే ప్రజలు వారికి ఎందుకు పట్టం కట్టలేదని నిలదీశారు. 2019 ఎన్నికలకు ప్రణాళికలు రచిస్తున్నామని కాంగ్రెస్ పగటి కలలు కంటోందని, ఇప్పటికే ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. ప్రతిపక్షాలు 2024 ఎన్నికలను టార్గెట్ చేసుకొంటే మంచిదని సలహా ఇచ్చారు. ధర్నా చౌక్ ను ప్రధాన సమస్యగా టీజేఏసీ, బీజేపీ భావిస్తున్నాయని, ఇందిరాపార్క్ వద్ద ధర్నాలు వద్దని అన్నాం కానీ, అసలు ధర్నాలే వద్దని తాము చెప్పలేదన్నారు. పార్టీ సభ్యత్వం కోసం పోటీ పెరిగిందని, 50 లక్షల టార్గెట్‌గా పెట్టుకున్నా, 70 లక్షల సభ్యత్వాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోందని విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.