
సాక్షిప్రతినిధి, ఖమ్మం: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ చకచకా జరుగుతోంది. రెండు రోజుల క్రితమే జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జీపీలను కేటాయించారు. బుధవారం సర్పంచ్‌ల రిజర్వేషన్ కోటాను అధికారులు తేల్చారు. ఈ లెక్కన ఏన్కూరు మండలంలోని 25 గ్రామ పంచాయతీలు, కామేపల్లి మండలంలోని 24 జీపీలు షెడ్యూల్డ్ ఏరియా పరిధిలోకి వచ్చాయి. ఈ క్రమంలో ఇక్కడ గిరిజన అభ్యర్థులు పోటీ చేయాల్సి ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జిల్లాలోని ఎన్ని గ్రామ పంచాయతీలు ఏ కేటగిరీలోకి వస్తాయో ప్రకటించింది. ఈ లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 584 గ్రామ పంచాయతీలు ఉండగా.. 50 శాతం జీపీలను మహిళలకు రిజర్వు చేశారు. దీని ప్రకారం 292జీపీలలో మహిళలు పోటీచేయాల్సి ఉంటుంది. మొత్తం జీపీల్లో 99 ఏజెన్సీ ప్రాంతంలో ఉండగా.. 11గ్రామ పంచాయతీలు పూర్తిగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిని ఎస్టీలకు రిజర్వు చేశారు. ఇక మిగిలిన 474 గ్రామ పంచాయతీల్లో ఎస్టీలకు 59, ఎస్సీలకు 120, బీసీలకు 58 జీపీలను కేటాయించారు. ఇక మిగిలిన 237 గ్రామ పంచాయతీల్లో ఇతరులు పోటీ చేయనున్నారు.
షెడ్యూల్డ్ పరిధిలోని 99 జీపీలు ఇలా..
ఏజెన్సీ పరిధిలోని 99 గ్రామ పంచాయతీలకు సంబంధించిన వివరాలను జిల్లా అధికారులు ప్రకటించారు. ఇవి ఏయే మండలాల పరిధిలో ఉంటాయనేది అధికారులు తేల్చారు. దీంతో ఏన్కూరు మండలంలోని 25 గ్రామ పంచాయతీలు షెడ్యూల్డ్ పరిధిలోకి వచ్చాయి. అలాగే కామేపల్లి మండలంలోని 24 జీపీలు కూడా షెడ్యూల్డ్ ఏరియా పరిధిలోకి వచ్చాయి. సింగరేణి మండలంలోని 41 గ్రామ పంచాయతీల్లో 39 షెడ్యూల్డ్ ఏరియా పరిధిలోకి వచ్చాయి.
సత్తుపల్లి మండలంలోని 21 గ్రామ పంచాయతీల్లో మూడు జీపీలు షెడ్యూల్డ్ ఏరియా పరిధిలోకి, పెనుబల్లి మండలంలోని 33 గ్రామ పంచాయతీల్లో 8 జీపీలు షెడ్యూల్డ్ ఏరియా పరిధిలోకి కేటాయించారు. అలాగే 100 శాతం గిరిజనులున్న గ్రామ పంచాయతీల్లో కొణిజర్లలో ఒకటి, కూసుమంచిలో మూడు, నేలకొండపల్లిలో ఒకటి, రఘునాథపాలెంలో 2, తిరుమలాయపాలెంలో 3, వేంసూరులో ఒక గ్రామ పంచాయతీలను కేటాయించారు.