జనగామ: ముందస్తు ఎలక్షన్ ఫీవర్.. మరో పక్క పోటీ పరీక్షల హడావుడితో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. వీఆర్వో రాత పరీక్షను ప్రశాంతంగా ముగించుకుని ఊపిరి పీల్చుకునేలోపే.. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్షలు రానే వచ్చాయి. నాలుగేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతీయువకులు ప్రిపరేషన్‌లో మునిగిపోయారు. కోచింగ్ సెంటర్లు.. యూట్యూబ్.. ఆన్‌లైన్ ఇలా ప్రతిదీ సద్వినియోగం చేసుకుంటూ ఉద్యోగం సంపాదించాలనే పట్టుదలతో ఉన్నారు. ప్రస్తుతం ప్రైవేట్, కాంట్రాక్టు, రెగ్యులర్, తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్న వారు సైతం సెలవులు పెట్టుకుని.. జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోటీ పరీక్షకు సన్నద్ధమవుతున్నారు.
జనగామ జిల్లా వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు వెల్లువెత్తాయి. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఈ నెల 3న నోటిఫికేషన్ వెలువడగా.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఇదే నెల 12 వరకు చివరి అవకాశం కల్పించారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో సర్వర్ డౌన్, సాంకేతిక లోపం కారణంగా ఈ నెల 14 వరకు గడువు పెంచుతూ ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఆన్‌లైన్ ద్వారా ఒక్కసారిగా దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లాలో 204 పోస్టులు ఖాళీగా ఉండగా.. 7,938 మంది నుంచి దరఖాస్తులు వచ్చినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.
నోటిఫికేషన్ జారీలో ఆగమాగం
ఉద్యోగాల నోటిఫికేషన్ జారీలో అధికారుల అనాలోచిత నిర్ణయాలు నిరుద్యోగుల పాలిట శాపంగా మారుతున్నాయి. సిలబస్, పరీక్ష నిర్వహణ తేదీలు, ప్రిపరేషన్ సమయం తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే నోటిఫికేషన్ జారీ చేస్తారు. కానీ, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాల భర్తీపై అధికారులు సరైన కసరత్తు చేయకుండా హడావుడిగా నోటిఫికేషన్ జారీ చేశారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత నెల రోజులు కూడా ప్రిపరేషన్‌కు సమయం లేకుండా అక్టోబర్ 4న పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ముందుగా నిర్ణయం తీసుకోవడంతో అభ్యర్థులు కలవరపడ్డారు.
అదే రోజు గురుకుల పీజీటీ పరీక్షతోపాటు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) పరీక్షలు ఉండడంతో 10వ తేదీ తేదీ నిర్వహించేలా మార్పులు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్వహించే విధంగా ఈ పరీక్షకు నెగెటివ్ మార్కింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఉద్యోగాలకు 200 మార్కులు, రెండు పేపర్ల చొప్పున భారీ సిలబస్ ఇచ్చిన అధికారులు.. నెలరోజులు కూడా సమయం లేకుండా పరీక్ష తేదీ నిర్వహించనుండడంపై మండిపడుతున్నారు.
గ్రూప్స్ ఉద్యోగాలకు ఎదురు చూసి..
వాస్తవానికి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న గ్రూప్–1, గ్రూప్–2 తదితర ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తాయనుకున్న నిరుద్యోగులకు నిరాశనే మిగిల్చింది. ముందస్తుగా కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయడంతో కొత్త ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగులు ఆశలు వదులుకున్నారు. దీంతో ఈ సమయంలో జారీ అయిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలపై నిరుద్యోగులు గంపెడాశలు పెట్టుకున్నారు.
అక్టోబర్ 10న పరీక్ష
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష అక్టోబర్ 10న నిర్వహిస్తున్నాం. 4న ముందుగా అనుకున్న టీఎస్‌పీఎస్సీ..అభ్యర్థుల అభ్యర్థన మేరకు 10కి మార్చింది. జిల్లాలో 204 పోస్టులకు 7,938 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందు కోసం 15 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. –వెంకటేశ్వరావు, జిల్లా పంచాయతీ అధికారి, జనగామ
Comments
Please login to add a commentAdd a comment