ప్రజావసరాలను తీర్చేలా పంచాయతీలు
గ్రామీణాభివృద్ధిపై వర్క్‌షాప్‌లో మంత్రి జూపల్లి
సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లోని ప్రజల అసరాలను తీర్చగలిగేలా పంచాయతీలు స్వయంసమృద్ధి సాధించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకాంక్షించారు. గ్రామ సభల్లో స్థానిక ప్రజలను భాగస్వాములను చేసి వారు కోరుకుంటున్న విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శనివారం తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (టిసిపార్డ్)లో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం.. తదితర అంశాలు ప్రధాన సమస్యలుగా కనిపిస్తున్నాయని, ఆయా సమస్యలను పరిష్కరించేందుకు గ్రామసభలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేందుకు సర్పంచు లు, కార్యదర్శులు శ్రద్ధ చూపాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల లబ్ధిని గ్రామాల్లో అర్హులైన వారికి అందేలా చూడాల్సిన బాధ్యత సర్పంచులదేనన్నారు. 14వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధులు, పంచాయతీల సొంత వనరులు, ఉపాధి హామీ నుంచి అందే నిధులతో గ్రామాభివృద్ధికి ప్రణాళికలు సిధ్ధం చేసుకోవాలని సూచించారు.
నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ
గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించి, శిక్షణ పూర్తిచేసుకున్న వారికి తగిన సంస్థలలో ఉపాధి అవకాశాలను కల్పించాలని గ్రామీణాభివృద్ధి విభాగం అధికారులను మంత్రి ఆదేశించారు. పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ మాట్లాడుతూ.. తాగు నీరు, పారిశుధ్యం సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులను విడుదల చేసిందని, వాటిని వీలైనంత త్వరగా ఖర్చు చేసి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. గ్రామ పంచాయతీలను పటిష్ట పరిచేందుకు ఉపాధిహామీ పథకం నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని డెరైక్టర్ అనితారాంచంద్రన్ సూచించారు.