పెద్దవూర మండలంలోనే ఎక్కువ తండాలు పంచాయతీలుగా మారనున్నాయి. ఈ మండలంలో సుమారు 45 గిరిజన తండాలు ఉండగా ప్రస్తుతం 23 తండాలు పంచాయతీలు కానున్నాయి. జిల్లాలో 38 మండలాల్లోనే తండాలు పంచాయతీలుగా మారే అవకాశం ఉంది. కొన్ని మండలాల్లో తండాలు లేకపోవడంతోపాటు మరికొన్నింటిలో ఒక్కొక్క తండా కూడా ఉన్నాయి. వేములపల్లి, నాంపల్లి, అర్వపల్లి, ఆలేరు, చౌటుప్పల్, మునగాల, నడిగూడెం మండలాల్లో ఒక్కొక్క తండా గ్రామపంచాయతీగా మారనుంది. అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురవుతున్న తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి అభివృద్ధి చేస్తామని గత పాలకులు ఇచ్చిన ఎన్నో హామీలు కాలంతో పాటే కరిగిపోయాయి.
కానీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా పంచాయతీ అర్హత గల తండాలను గుర్తించి ప్రతిపాదనలు పంపాలని గ్రామీణ అభివృద్ధిశాఖ ప్రధాన కార్యదర్శి రేమండ్ పీటర్ 2014 జూలై 23వ తేదీన ఆదేశాలు జారీ చేశారు. దాంతో 500 జనాభా కలిగి ఉండి, పంచాయతీకి 2 నుంచి 3 కిలో మీటర్ల దూరంలో ఉన్న తండాలపై సమగ్ర సర్వే నిర్వహించిన జిల్లా యంత్రాంగం 239 తండాలను గుర్తించింది. కాగా ఈ నెల 15 తేదీ లోగా పంచాయతీల ప్రతిపాదనలు పంపాల్సి ఉన్నప్పటికీ సమగ్ర కుటుంబ సర్వే కారణంగా ఆలస్యమైంది. దీంతో సోమవారం జిల్లా పంచాయతీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధమయ్యారు.
పెరగనున్న పంచాయతీలు..
500 మంది జనాభాతో పాటు ప్రభుత్వ నిబంధనల మేరకు గిరిజన తండాలను పంచాయతీలుగా గురిస్తే జిల్లాలో పంచాయతీల సంఖ్య భారీగా పెరగనున్నది. ప్రస్తుతం జిల్లాలో 1176 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గుర్తించిన 239 తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తే వీటి సంఖ్య 1415 కానుంది. అదే విధంగా పంచాయతీలలో గిరిజన తండాల సంఖ్య కూడా భారీగానే ఉండనుంది. జిల్లాలో మొత్తం గిరిజన తండాలు 905. వీటిలో 324 తండాలు గతంలోనే పంచాయతీలుగా గుర్తించారు. కొత్తగా మరో 239 తండాలు పంచాయతీలుగా ఏర్పడితే జిల్లాలోని 1415 పంచాయతీలలో 563తండాలు పంచాయతీలుగా కానున్నాయి.
సర్వేలో సేకరించిన వివరాలు
గుర్తించిన గిరిజన తండా ఏ మండలం,
ఏ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది.
గిరిజన తండాలోని జనాభా వివరాలు.
గ్రామ పంచాయతీగా గుర్తించడానికి ప్రతిపాదించే తండాల సంఖ్య.
పస్తుత గ్రామ పంచాయతీకి తండా ఎంత దూరంలో ఉంది.
గిరిజన తండాకు ఏ గ్రామ పంచాయతీగా గుర్తించాలో పేరు ప్రతిపాదన.
గ్రామ పంచాయతీ నుంచి తండాను తొలగించగా అక్కడ ఉన్న జనాభా వివరాలు.
పంచాయతీలుగా 239 తండాలు
Published Mon, Aug 25 2014 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 PM
Advertisement