సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌పై శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదగడానికి హిందువులను దుయ్యబడితేనే నాయకులు అవుతారా అంటూ కమల్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ కమల్ లోకనాయకుడు కాదు...లోకల్ నాయకుడిగా కూడా పనికిరారు. మీరు కమల్‌హాసన్ కాదు. ఉగ్రవాది కమల్‌హాసన్. హిందువులను విమర్శిస్తే రాజకీయ నేతగా ఎదుగుతారా?. హిందువులను తీవ్రవాదులన్నవారు కచ్చితంగా ఉగ్రవాదులే. హిందు ధర్మాన్ని కించపరిచి కమల్ ధర్మద్రోహిగా మారారు. తీసిన సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో కమల్‌కు పిచ్చి పట్టింది. హిందుమతంపై వ్యాఖ్యలు ఉపసంహరించుకోకుంటే వచ్చే ఎన్నికల్లో సంహార ప్రక్రియను కమల్ చూస్తారు. కమల్ వేషం వెనుక విషం ఉంది.’ అని నిప్పులు చెరిగారు. సినిమాలు తీసేటప్పుడు హిందువులు కావాల్సి వచ్చిందని, ఇపుడు హిందూ మతాన్ని కించపరిచే కమల్ ధర్మద్రోహిగా ఎదిగాడని పరిపూర్ణానంద స్వామి అన్నారు.
కట్టిన బట్ట, నివాసం, సుఖభోగాలతో కూడుకున్న జీవన విధానం హిందూ సమాజానిది కాదా అని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ లాంటి మహా నటుడు రాజకీయాల్లోకొచ్చినా హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ ఇతర మతాలను గౌరవించారంటూ రాజకీయాల్లోకి రావాలనుకున్న నటులు ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని హితవు పలికారు. హిందూమతంపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తే ఓటమిని చవిచూస్తారని పరిపూర్ణానందస్వామి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment